29-09-2025 12:23:53 AM
-చిన్న నీటివనరుల పరిరక్షణే లక్ష్యం
-మూసీ పరీవాహక పేదలకు పునరావాసం
-బతుకమ్మకుంట పునఃప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,సిటీ బ్యూరో సెప్టెంబర్ 28 (విజయక్రాంతి ): ‘హైదరాబాద్‌కు వరంలాంటి చెరువులు, మూసీ నది కబ్జాలకు గురై శాపంగా మారాయి. చెరువులను కబ్జా చేస్తే తాట తీస్తామని చెప్పాం. మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపై ఆ ఆటలు సాగవు. ప్రభుత్వ భూములను కబళించాలని చూసే ఏ మాయగాడినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన, చెరువుల పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, దీనికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం అంబర్‌పేటలో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ రీజనరేషన్ ఏజెన్సీ (హైడ్రా) ఆధ్వర్యంలో రూ.7.40 కోట్లతో పునరుద్ధరించిన చారిత్రాత్మక బతుకమ్మకుంటను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మూసీ తీరంలో నివసిస్తున్న పేదలకు శాశ్వత పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఎంతటివారినైనా ఉపేక్షించం
హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు చాలామంది విమర్శించారని, కానీ దాని లక్ష్యం కబ్జాలను కాపాడేవారికి అర్థం కాలేదని సీఎం అన్నారు. హైటెక్ సిటీలోని తుమ్మడికుంటను ఆక్రమించి సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కట్టారు. హైడ్రా అధికారులు వాస్తవాలు వివరించిన తర్వాత, ఆయన తన తప్పు తెలుసుకుని స్వయంగా రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు అని సీఎం గుర్తుచేశారు. కబ్జాదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని పేదల కష్టాలు తనకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న వర్షానికే మూసీ చుట్టుపక్కల ఇళ్లు మునిగిపోతున్నాయి. ఆ పేదలను ఖాళీ చేయిస్తే నాకేమొస్తుంది? భవిష్యత్ తరాల కోసమే ఈ ప్రక్షాళన. వారికి శాశ్వత పునరావాసం కల్పించే బాధ్యత నాది. దీనిపై వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆదేశిస్తున్నా అని తెలిపారు.
కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత, విమలక్క, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ హరిచందన, జీహెఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బతుకమ్మకుంటకు ‘వీహెచ్’ పేరు
బతుకమ్మకుంట పునరుద్ధరణ కోసం సీనియర్ నేత వి.హనుమంతరావు జీవితాంతం పోరాడారని సీఎం కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే ఈ కుంటకు పూర్వవైభ వం వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ప్రజలందరి కోరిక మేరకు ఈ బతుకమ్మకుంటకు ‘వి. హనుమంతరావు’ పేరు పెడుతున్నాం అని ప్రకటించారు.