calender_icon.png 28 October, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాధనం అక్రమ మళ్లింపు!

28-10-2025 12:08:37 AM

కోలాహలం రామ్ కిశోర్ :

భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్--ప్రభుత్వ సంబంధాలు ఎప్పుడూ వివాదాస్పదమే. ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక దర్యాప్తు నివేదికలో, మోదీ ప్రభుత్వం అదానీ గ్రూపును ఆదుకోవడానికి ప్రజా నిధులను ఉపయోగించినట్లు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం అమెరికా లాంటి విదేశీ బ్యాంకు లు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేసిన సమయంలో, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) నుంచి దాదాపు 3.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33 వేల కోట్ల రూపాయలు) అదానీ సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించారు.

ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ప్రభుత్వం ఒక ప్రైవేటు సమూహానికి అనుకూలంగా చేసిన చర్యగా కనిపిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం భారత రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ముఖ్యంగా అదానీ పై అమెరికాలో పలు కేసుల్లో దర్యాప్తులు జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం మరింత కలకలం రేపింది. అదా నీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి మో దీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి.

2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అదానీ సంస్థల్లో స్టాక్ మానిప్యులేషన్, ఆర్థిక అవకతవకలు ఉన్నాయని పేర్కొంది. దీంతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. ఇప్పుడు, అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ (డీఓజే), సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజి కమిషన్ (ఎస్‌ఈసీ) అదానీపై మరిన్ని ఆరోపణలు చేశాయి.

2024 న వంబర్‌లో వెలువడిన ఇండిక్ట్‌మెంట్ ప్రకారం, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ప్రాజెక్టుల కోసం భారత అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ లంచాలను దాచి, అమెరికా పెట్టుబడిదారుల నుంచి 2  బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిపారు. 2025 అక్టోబర్ నాటికి భారత అధికారులు అమెరికా సమన్లు అందించడంలో విఫలమయ్యారని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది. ఇవి అదానీ గ్రూపు ఆర్థిక స్థితిని మరింత బలహీనపరుస్తున్నాయి.

మధ్యతరగతిపై భారం

ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ నివేది క మరింత ఆసక్తికరం. మే 2025 లో ప్ర భుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఎల్‌ఐసీ సమన్వయంతో ఒక ప్లాన్ రూ పొందించారని పేర్కొంది. అదానీ పోర్ట్స్ కోసం 585 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ జరిగింది. దీనిని ఎల్‌ఐసీ మాత్రమే సబ్‌స్క్రుబ్ చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్స్ లాంటి సంస్థల్లో 3.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెంచారు.

ఈ చర్యలు అదానీ గ్రూపు రుణాలు (2024లో 20 శాతం పెరిగాయి) తగ్గించడానికి సహాయపడ్డాయి. కానీ, ఇది ప్రజా నిధుల దుర్వినియోగమని విమర్శకులు పే ర్కొంటున్నారు. ఎల్‌ఐసీకు 30 కోట్ల మం ది పాలసీ హోల్డర్లు ఉన్నారు, వీరు ఎక్కువగా మధ్యతరగతి, గ్రామీణ ప్రజలు. వారి పొదుపులను ముప్పుతో కూడుకున్న వాటిలో పెట్టుబడులు పెట్టడం సరైనది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హిండెన్బర్గ్ నివేదిక తర్వాత ఎల్‌ఐసీ అదానీ షేర్లలో రూ.7,850 కోట్ల రూపాయల నష్టపోయింది . గతంలో అదానీ గ్రూప్ ఎదుర్కొన్న వివాదాలను కూడా వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక కథనంగా ప్రస్తావించడం గమనార్హం. తప్పుడు సమాచా రం ద్వారా అమెరికా సంస్థల నుంచి పెట్టుబడులు పొందేందుకు అదానీ గ్రూపు ప్రయత్నించిందని అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలను పత్రిక గుర్తు చేసింది.

250 మిలియన్ డాలర్లు భారతదేశంలో నాయకులకు, అధికారులకు లంచాలిచ్చి తప్పుడు పత్రాలు తెప్పించుకున్నారని పేర్కొంది. అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజి కమిషన్ తమ నిబంధనలను అదానీ ఉల్లంఘించినట్లు సివిల్ కేసు వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2023 నాటి హిండెన్‌బర్గ్ నివేదికను కూడా పత్రిక ప్రస్తావించింది. అదానీ గ్రూప్ అనుమానాస్పద విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు పెట్టించడం ద్వారా తమ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుందని హిం డెన్‌బర్గ్ ఆరోపించింది.

దీనిపై సెబీ దర్యా ప్తు చేసి రెండింటిని తోసిపుచ్చింది. మరికొన్ని ఆరోపణలపై సెబీ దర్యాప్తు కొనసా గుతోంది. వీటికితోడు 2014లో మోదీ ప్రచారానికి అదానీ ప్రైవేట్ జెట్‌ను వాడుకున్నారని బలంగా పేర్కొంది. దీనికి తోడు అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికలను తన కథనంలో ప్రస్తావించింది.

ప్రతిపక్షాల ఆగ్రహం

ఎల్‌ఐసీ పెట్టుబడులను అదానీ సంస్థ కు మళ్లించడంపై ప్రతిపక్షాలు కూడా ఆగ్ర హం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, మల్లికార్జున ఖర్గేలు ఇది ‘క్రోనీ క్యాపిటలిజం’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పెట్టిన కొన్ని పోస్టులు ‘మోదీ--అదానీ’ బంధమని, ‘గుజరాత్ మాఫియా’ అని అభివర్ణించేలా ఉన్నాయి.

మరికొన్ని ఎల్‌ఐసీ పెట్టుబడులు మార్కెట్ ఆధారితమని డిఫెండ్ చేస్తున్నాయి. అయితే, అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ‘నిరాధారం’ అని ఖండించింది. ఎల్‌ఐసీ కూడా తమ పెట్టుబడులు డ్యూ డిలిజెన్స్‌తో చేస్తామని, ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేదని చెప్పింది. అదానీ బాండ్లు 10-సంవత్సరాల ప్రభుత్వ సెక్యూరిటీల కంటే 8.02 శాతం అధిక రాబడి ఇస్తున్నాయని వారు వాదిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్‌లో గౌతమ్ అదానీ, అతడి సహచరులు.. తమ కంపెనీ గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించినందుకు అమెరికాలో వాళ్లపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో నాలుగు గంటల ట్రేడింగ్‌లో రూ.7850 కోట్లు నష్టపోయినట్లు తెలిపా రు. ప్రధాని మోదీ ప్రజాధనాన్ని తన మి త్రులకు పంచారని.. అందుకే అప్పుడు ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు.

అలాగే అదానీ గ్రూప్ కోసమే ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు వంటి కీలక మౌలిక సదుపాయల ఆస్తులను కేంద్రం ప్రైవేటీకరణ చేసి నట్లు ఆరోపణలు చేశారు. అలాగే విదేశాల్లో కూడా అదానీ గ్రూప్‌కు కాంట్రాక్టు లు అప్పగించేందుకు దౌత్య వనరులు దు ర్వినియోగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జైరాం రమేశ్ చేసిన ఆరోపణలపై కేంద్రం గానీ అదానీ గ్రూప్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

జవాబుదారీతనమేదీ?

మరోవైపు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ఎల్‌ఐసీ ఖండించింది. తమ పెట్టుబడి నిర్ణయాలను ఎవరూ ప్రభావితం చేయలేదని, తాము స్వతంత్రంగానే, తమ విధివిధానాలకు లోబడి నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. తమ నిర్ణయాల్లో ఆర్థిక శాఖ కానీ ఇతర ఏ సంస్థల జోక్యం లేదని స్పష్టం చేసింది. 3.9 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదన పత్రం ఏమీ కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఎల్‌ఐసీల మధ్య చర్చకు రాలేదని చెప్పింది.

విశ్లేషణాత్మకంగా చూస్తే, ఇది భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం సమస్యను హైలైట్ చేస్తుంది. అదానీ గ్రూపు ఓడరేవులు, విద్యుత్, మౌలిక సదుపాయాల్లో విస్తరణ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. కానీ దాని కోసం ప్రజా సంస్థలను ఉపయోగించడం సరికాదు. సెబీ హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో కొన్నింటిని తోసిపుచ్చింది. కానీ అదానీ సంస్థలపై ఇప్పటికీ అమెరికా తన దర్యాప్తులు కొనసాగిస్తూనే ఉంది. ఇది పెట్టుబ డిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఆస్ట్రేలియా ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ టీమ్ బక్లీ లాంటి నిపుణులు ‘క్రోనీ క్యాపిటలిజం ఇంకా సజీవంగా ఉంది’ అని చురకలంటిస్తున్నారు.  చివరగా, ఈ వివాదం ప్రభు త్వం, కార్పొరేట్ల మధ్య సమతుల్యత గురిం చి ప్రశ్నలు లేవనెత్తుతుంది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం అయితే, అది సామాన్యులకు నష్టం. తక్షణమే స్వతంత్ర దర్యాప్తు అవసరం లేకపోతే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో మరిన్ని తలెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 వ్యాసకర్త సెల్: 9849328496