28-10-2025 12:04:31 AM
వెంకగారి భూమయ్య :
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయి నప్పుడే రవాణా శాఖ అధికారులకు, ప్రభుత్వాలకు తనిఖీలు గుర్తుకొస్తున్నాయా అనేది ఆలోచించాల్సిన అంశం. కేవలం పత్రికా ప్రకటనల కోసం తూతూ మంత్రం గా నిర్వహిస్తున్న తనిఖీలతో నిత్యం జరుగుతున్న ప్రమాదాలను ఎలా అరికట్టగ లుగుతున్నారో ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు సమాధానం ఇవ్వాల్సిన అవసరముందని పౌర సమాజం, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడే రవాణా శాఖ అధికారులైనా, ప్రభుత్వమైనా నిత్యం రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్‌ను తనిఖీ చేయడమేంటని ప్రజ లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు సంబంధించిన ట్రావెల్స్, 90 శాతం ప్రైవేట్ స్కూల్ బస్సులు రాజకీయ నాయకులకు చెందినవే అయినప్పుడు నిబంధనలు అమల్లోకి రావు.
ఇలా ప్రమాదాలు జరిగితే మాత్రం అప్పటిదాకా గుర్తుకు రాని నిబంధనలైనా, తనిఖీలైనా అప్పుడే ఎందుకు మొదలు పెడుతారనేది అర్థం కాని విషయం. ప్రమాదాల ద్వారా సంభవిస్తున్న ఈ ప్రాణనష్టాలన్నింటినీ ప్రభుత్వ హత్యల కిందనే నమోదు చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అధికారులు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి, నిబంధనల ఉల్లంఘనలను చూసీ చూడనట్లు వదిలేయడం అత్యంత బాధాకరం.
హత్యలు ఎవరివీ?
అధికారులు తనిఖీలు నిర్వహించడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ రాజకీయ ఒత్తిళ్లతో వాటిని నిలిపివేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందువల్ల ఈ మరణాలను రాజకీయ హత్యలు అందామా? లేక అధికారుల విధి నిర్వహణలో చేస్తున్న నిర్లక్ష్యం కావడంతో వీటిని ప్రభుత్వ హత్యలు అందామా? అనే గందరగోళం అందరిలోనూ నెలకొంది. అధికా రులు మత్తు వీడి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడితే తప్ప ప్రమాదాలు అరికట్టలేని పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బస్సు ల్లో తప్పనిసరిగా ఉండాల్సిన అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, లైఫ్ సేవింగ్ కిట్స్ వంటి అత్యవసర అంశాలను అధికారులు పరిశీలించడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఏ బస్సులో కూడా అవి సరిగా అందుబాటులో కనిపించడం లేదంటే రవాణా శాఖ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇలా ఏదో ఒకరోజు పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే బాధ్యతలు గుర్తొచ్చి అప్పటి నుంచి వారం రోజుల దాకా తమ నిజాయితీని చూపించుకునేందుకు తనిఖీల పేరు తో హడావిడి చేయడం షరామాములే. ఈ విషయాన్ని అందరూ మరిచిపోయిన తర్వాత అధికారులు కూడా తనిఖీలు ఆపేయడం అలవాటైపోయింది. చట్టాన్ని అతి క్రమించి, నిబంధనలను ఉల్లఘింస్తున్న అధికారులకు ప్రభుత్వం కూడా వంత పాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయనడంలో సందేహం లేదు.
శాశ్వత వ్యవస్థ అవసరం
ఇలా నాణ్యత లేని బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు యథేచ్ఛగా రో డ్ల మీద తిప్పడంపై కఠిన చర్యలు తీసుకునేలా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మే ల్కొనాలని పౌర సమాజం డిమాండ్ చే స్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్, విద్యాసంస్థల బస్సులపై నిరంతరాయంగా, పారదర్శకంగా తనిఖీలు నిర్వహించడానికి శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీలు చేసి, చేతులు దులుపుకోవడమనే విషయాన్ని పక్కనబెట్ఠాలి. రవాణా శాఖ అధికారులు మత్తు వీడి నిరంతరం ట్రావెల్స్ పై నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్ల క్ష్యం వల్ల జరిగే ప్రతి ప్రాణ నష్టాన్ని ప్రభు త్వ హత్యగా పరిగణించాల్సిన పరిస్థితిని సృష్టించవద్దని పౌర సమాజం తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తోంది.
ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రత, రక్షణను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తూ ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీలలో బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు (ఎఫ్‌సి), ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు తదితరాలను అధికారులు పరిశీలించారు.
అంతేకా కుండా, బస్సుల్లో ఉండే అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, సీటింగ్ సామర్థ్యం వంటి అంశాలను కూడా అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా కొన్ని వాహనా లు నిబంధనలు ఉల్లఘించినట్లు తేలడం తో వాటిపై చట్టపరమైన చర్యలు తీసు కున్నారు. అంతేకాదు ఈ చర్యల తర్వాత కూడా పౌర సమాజం, ప్రజలతో.. విద్యా సంస్థల యాజమాన్యాలకు, డ్రైవర్లకు జరుగుతున్న ప్రమాదాలపై కొన్ని కీలక సూచనలు ఇప్పించారు.
కఠిన చర్యలు
విద్యార్థుల భద్రత విషయంలో రాజీపడటం జరగదని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చ ర్యలు తప్పవని పౌర సంఘాలు కూడా హె చ్చరికలు జారీ చేస్తున్నాయి. డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పా టించాలని, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలు వంటి అంశాలపై స్వీయ నియంత్ర ణ పాటించాలని ప్రజలు కోరుకుంటున్నా రు.
డ్రైవర్‌లు ఎప్పటికప్పుడు తగిన విశ్రాం తి తీసుకోవడం, మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంలో వాహనాలు నడపకూడ దనే నిబంధనను తప్పక పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థుల ర వాణా బాధ్యతను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, వాహనాలపై రవాణా ని బంధనలను తప్పనిసరిగా పాటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉదయం, సాయంత్రం సమయంలో డ్రైవర్ వా హనం తీసుకుని విద్యార్థుల కోసం వెళుతున్న సమయంలో స్కూల్ యాజమా న్యం తప్పకుండా చెక్ చేసి పంపాలనే విజ్ఞప్తులు వస్తు న్నాయి. ప్రైవేటు సంస్థలు, ట్రావెల్స్ ఏ ఒక్క నిబంధన, అతిక్రమణలను ఉల్లంఘిస్తే సదరు యాజమాన్యా లపై ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
వ్యాసకర్త సెల్: 9848559863