31-10-2025 06:00:56 PM
 
							కాసులు కురిపిస్తున్న మూసీ ఇసుక
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో మూసీ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా మూసీకి వస్తున్న వరదలతో మూసీ నదిలో పెద్ద ఎత్తున ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అయితే వరద తగ్గినప్పుడు ఇసుకను మూసీ నుండి ఇసుక అక్రమ రవాణాదారులు సేకరించి డంపులుగా చేసుకుని రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులకు మూసీ ఇసుక మూడు పువ్వులు, ఆరు కాయలుగా కాసులు కురిపిస్తుంది. వలిగొండ మండలంలోని మూసీ పరివాహక ప్రాంతాలైన గోకారం, ప్రొద్దుటూరు, లింగరాజుపల్లి, లోతుకుంట, గుర్నాథ్ పల్లి, వేములకొండ గ్రామాలలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా రాత్రి, పగలు అనే తేడా లేకుండా కొనసాగుతుంది.
ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడం గమనిస్తే దీనిని అధికారులు ఎవరూ పట్టించుకోనట్లు తెలుస్తుందని పలువురు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ఇసుకను ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు ఇసుక రవాణాదారులు 6,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుండడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చేసేది ఏమీ లేక రవాణాదారులు చెప్పిన ధరను చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూసీ నుండి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.