08-01-2026 12:00:00 AM
మోతె మండలం తుమ్మగూడెం సమీపంలో గుట్టను తొలుస్తున్న అక్రమార్కులు.
రెండెకరాలకు పైగా చదును చేసిన వైనం.
రోడ్డు పక్కనే పనులు నడుస్తున్న పట్టించుకోని అధికార ఘనం.
అధికారుల తీరుపై మండి పడుతున్న జనం.
మోతె, జనవరి 7 : రోజురోజుకు వ్యవసాయ భూమి రేటు పెరుగుతుండడంతో అక్రమార్కుల చూపు సైతం ఆ దిశకు మళ్ళింది. దీనిలో భాగంగానే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుట్టలు కొండలు, కుంటలు, చెరువులను సైతం అందిన కాడికి కబ్జా చేసి ఆక్రమించేస్తున్నారు. తర్వాత కొంతకాలం ఏదో ఒక రకమైన పంటను సాగు చేసి పట్టాగా మార్పిడి కోసం అడ్డదారుల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఘటనల్లో కొందరి అధికారుల పాత్ర సైతం ఉందంటూ పలుచోట్ల అభియోగాలు వస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి ఘటన ప్రస్తుతం మోతె మండలం తుమ్మగూడెం గ్రామంలో జరిగింది.
గుట్ట.. చీలింది ఇట్టా!..
తుమ్మ గూడెం గ్రామ సమీపంలో గల సర్వే నెంబర్ 331లో 36 ఎకరాల10 గుంటల ప్రభుత్వ భూమి ( గంగదేవి గుట్ట) ఉంది. అయితే దీనిలోనే గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు లను ఏర్పాటు చేసింది. అయితే మిగిలిన భూమిలో ఐదుగురు వ్యక్తుల పేరిట ఆన్ లైన్ లో ఐదు ఎకరాల కంటే ఎక్కువగా చూపిస్తుండడం గమనార్హం. అయితే వీరి పేరు అసలు రికార్డులలో లేకపోగా నేరుగా ఆన్ లైన్ లో ఎలా ఎంటర్ అయింది అనేది భాగతుడికే ఎరుక. ఇక ఇదే సర్వే నంబర్ లో అనుమతులు ఉన్నాయంటూ ఓ వ్యక్తి కొన్ని ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరుపుతుండడం గమనించదగిన విషయం. అలాగే పైవైపున వ్యవసాయ భూములున్న రైతులు వారి పొలాలకు వెళ్లేందుకు దారిగా కొంతమేర గుట్టను వాడుకుంటున్నారు.
అదును చూసి చదును : అయితే చెరువుని ఆనుకుని ఉన్న ఈ గంగ దేవి గుట్టను ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపేటకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రాళ్లను తొలగించే యంత్రాలు తెచ్చి కొన్ని రోజులుగా తొలగించేస్తున్నాడని స్థానికుల ద్వారా తెలుస్తుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొందరి సహకారంతో పేలుడు పదార్థాలను తెచ్చి గుట్టను ధ్వంసం చేసేందుకు వినియోగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా సదరు వ్యక్తి ఎవరు ఆవైపు వెళ్లని సమయంలో గుట్టని డోజర్లతో చదును చేశాడు. దీంతో గుట్టపై ఇప్పటికే సుమారు రెండు ఎకరాలకు పైగా చదును అయ్యింది.
పట్టించుకోని అధికారులు
తుమ్మగూడెం నుండి గోపతండకు వెళ్లే రోడ్డును అనుకునీ ఉన్న ఈ గుట్టను ఒక వ్యక్తి యదేచ్ఛగా తవ్వి చదును చేసుకుంటుంటే అధికారులు మాత్రం ఆ వైపుగా చూడకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్న అటువైపు వెళ్ళని అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని, అలాగే ఇటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నా ఇటు మైనింగ్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదంటూ స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 36 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న గుట్టను అందిన కాడికి దోచుకుంటూ, అక్రమంగా ఆక్రమిస్తున్నటువంటి అక్రమార్కుల పైన ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వారి పైన కట్టిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పనులు నిలిపివేశాం
తుమ్మ గూడెం సమీపంలో గల గుట్టను తవ్వుతున్నారు అన్న సమాచారం రాగానే ఆర్ ఐ ని పంపించి వెంటనే పనులు నిలిపేశాం. వారి వద్ద ఉన్న ఆధారాలను తీసుకుని వచ్చి చూపించమని ఆదేశించాము. ప్రభుత్వ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
- వెంకన్న, తాసిల్దార్, మోతె.