08-01-2026 12:00:00 AM
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్, జనవరి 7 (విజయ క్రాంతి): ఫిబ్రవరి 25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల వసతులు సమకూర్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ఇప్పటి నుంచే పరీక్ష కేంద్రాలకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు థియరీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు సెషన్లలో మూడు స్పెల్స్లో జరుగుతాయని దీనికి గాను జిల్లా వ్యాప్తంగా జనరల్, ప్రాక్టికల్స్, ఒకేషనల్ కోర్సులకు పరీక్షలు ఉంటాయని ఆయన వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు గాను జిల్లాలో ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగానికి సంబంధించి 64780 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 1368 మంది.మొత్తం 66148 మంది పరీక్షలు రాస్తారని... అలాగే ద్వితీయ సంవత్సరంలో జనరల్లో 67792 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 1258 మొత్తం 69050 మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో జనరల్ విభాగానికి సంబంధించి మొత్తం 1,32,572 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో మొత్తం 2626 మంది మొత్తంగా 1,35,198 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియోట్ పరీక్షలకు గాను 151 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు.
పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను, పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, అవసరమైన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను, పరీక్షా కేంద్రాల నుండి జవాబు పత్రాలను పగడ్బందీగా తీసుకువెళ్లేందుకు పోస్టల్ శాఖ సహకరించాలని,
ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. దీనికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం.కిషన్, కళాశాలల ప్రినిసిపల్స్, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.