05-08-2025 12:05:43 AM
ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ డ్రామా త్వరలో పట్టాలెక్కనుంది. షాహిద్ కపూర్ కథానాయకుడిగా ‘రోమియో’ అనే టైటిల్‌తో దర్శకుడు విశాల్ భరద్వాజ్ దీన్ని తెరకెక్కించనున్నారు. డైరెక్టర్ ఇందులో హీరో షాహిద్ కపూర్ పాత్రను పలు షేడ్స్‌తో రూపొందించారని టాక్.
ఇందులో త్రిప్తి డిమ్రీ, నానా పటేకర్, రణ్‌దీప్ హుడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా కూడా భాగం కానున్నట్టు తెలుస్తోంది. ఇందులో మిల్కీ బ్యూటీ పోషించే పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పేలా కీలకంగా ఉండనుందట. షాహిద్ కపూర్, భరద్వాజ్ ఇంతకుముందు కమీనే, హైదర్, రంగూన్ చిత్రాల కోసం కలిసి పనిచేశారు.
అలా వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావటం.. కీలక పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేసుకోవటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను సెప్టెంబర్ చివరలో లేదా అక్టోబర్ ప్రారంభంలో విడుదల చేసే యోచనలో ఉన్న మేకర్స్.. ఆ తర్వాత ఇందుకు సంబంధించి టీజర్‌ను సైతం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే..
వేగంగా చిత్రీకరణ పూర్తిచేసి డిసెంబర్‌లోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఇక తమన్నా ఇటీవల ‘ఓదెల2’లో తన నటనతో మెప్పించింది. ఆ సినిమాలో రొటీన్‌కు భిన్నమైన అఘోరీ పాత్రలో నటించి, జీవించిన తమన్నా.. ‘రోమియో’లోనూ విభిన్నమైన పాత్రతో మరోమారు ప్రేక్షకుల మనసు దోచుకుంటుందని నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.