13-12-2024 01:29:34 AM
ప్రైవేట్ ఉద్యోగికి రూ.12.60 లక్షల టోకరా
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): స్టాక్ మార్కెట్ మెళకువలు నేర్పిస్తామంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని నమ్మించి అతడి ఖాతాలో ఉన్న రూ.12.60 లక్షలు స్వాహా చేశారు సైబర్ నేరగాళ్లు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి(31)కి ‘అంబరా క్యాపిటల్’ అనే సంస్థ పేరుతో ఉచితంగా స్టాక్ మార్కెట్ మెళకువలు నేర్పిస్తామంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
దానికి ఆకర్షితుడైన బాధితుడు వారి సూచనలను పాటిస్తూ ఒక నెలపాటు ఉచితంగా స్టాక్ మార్కెట్ మెళకువలు నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఉచిత సర్వీస్ చివరి రోజు అని పేర్కొన్న స్కామర్లు అతడిని తమ సబ్‌స్క్రిప్షన్ గ్రూప్‌లో చేరమని ఆహ్వానించారు. వారు చెప్పిన విధంగా బాధితుడు చందా రుసుము రూ.10 వేలు చెల్లించి ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు.
అనంతరం స్కామర్లు వాట్సప్ గ్రూప్‌లో తమ ఫండ్‌ను విపరీతంగా ప్రచారం చేసి, బాధితుడి నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.12.60 లక్షలు పెట్టుబడిగా పెట్టించుకున్నారు. ఆపై వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా.. వాటిపై 20శాతం ఛార్జీలు చెల్లించాలని స్కామర్లు చెప్పారు. దీంతో ఇదంతా సైబర్ మోసమని గ్రహించిన బాధితుడు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.