18-05-2025 12:18:43 AM
భారతదేశ స్వాతంత్య్ర పోరాట నేపథ్యం, భారతీయ సినిమాకు పడిన పునాదుల మేళవింపుగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ రూపొందనుంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టు విషయమై ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో కొంత కాలంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తాజాగా దీనిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్ర శేఖర్ శ్రీకృష్ణ స్పందించటంతో ఓ క్లారిటీ వచ్చినట్టయ్యింది. ఈ సినిమాలో ఫాల్కేగా నటించేది ఆమిర్‌ఖాన్ అని తెలుస్తోంది. ఆయనకు జోడీగా, దాదాసాహెబ్ ఫాల్కే భార్య సరస్వతీబాయి ఫాల్కే పాత్రను విద్యాబాలన్‌ను తీసుకోనున్నారనీ అర్థమవుతోంది.
ఈ సినిమాను రాజమౌళి సమర్పణలో రూపొందనుందని.. ఎన్టీఆర్ ఫాల్కే పాత్రను పోషించనున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ శ్రీకృష్ణ దీనిపై మాట్లాడుతూ రాజమౌళి, ఆయన టీమ్ తనతో మాట్లాడలేదని చెప్పారు. ఆమిర్ హిరాణీ టీమ్ మూడేళ్లుగా తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు.
ఫాల్కేగా ఆమిర్‌ఖాన్ నటించడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే భార్య సరస్వతీబాయి ఫాల్కే పాత్రకు విద్యాబాలన్‌ను తీసుకోవాలన్న అభిప్రాయాన్ని ఆమిర్ తనతో పంచుకున్నారని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. ఆయన మాటలను బ్టటి చూస్తే.. ఆమిర్ ‘సితారే జమీన్ పర్’ తర్వాత ఈ బయోపిక్ కోసం సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది.