calender_icon.png 18 May, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ విశిష్టతను ప్రపంచానికి చాటాలి

18-05-2025 12:58:03 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ భేటీ 
  2. భేటీలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ విజన్‌ను, ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ఆర్థిక శాస్త్ర నిపుణులు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీకి ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి వివరించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కం ట్రోల్ సెంటర్‌లో శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భం గా ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముచ్చటించారు. భేటీలో సీఎంతోపా టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కే రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణకు సంబంధించిన విశిష్టతను, ఇక్కడున్న అనుకూలతలను ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతుల సాధికారత, యువతకు ఉద్యోగాలతోపాటు స్కిల్ డెవలప్‌మెంట్ దిశగా ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యలను ప్రస్తావించారు.

రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వామ్యానికి ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిజిత్ బెనర్జీని ఆహ్వానించారు. భవిష్యత్ విజన్ రూప కల్పనలో ఇతర ప్రముఖులతో పాటు తమ అనుభవాలను పంచుకోవాలని కోరారు. గొప్ప విజన్‌తో ముందుకు సాగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని, అభిజిత్ బెన ర్జీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు బోర్డులో చేరడానికి సమ్మతించారు.

పోలీస్, మున్సిపల్ శాఖల్లో ట్రాన్స్‌జెండర్ల నియామకం, ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెక్టార్‌గా అభివృద్ధి చేసే ప్రణాళికను ఎంచుకోవడం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనికతకు అద్దం పట్టిందని అభిజిత్ బెనర్జీ అభినందించారు. ఫ్యూచర్ సిటీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచించారు. సంప్రదాయ చేతివృత్తులవారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని కోరారు.