calender_icon.png 18 May, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డలకు అండ

18-05-2025 12:14:39 AM

  1. ఆరోగ్య, ఆర్థిక వివరాలతో కూడిన  యూనిక్‌కోడ్ ఐడీ కార్డులు 
  2. మహిళా సంఘాల సభ్యులకు త్వరలోనే అందజేత
  3. గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు, వైద్యపరీక్షలు, చికిత్స వివరాల సేకరణ 
  4. కోటిమంది మహిళల హెల్త్‌ప్రొఫైల్ తయారీ 
  5. పట్టణప్రాంత మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక, ఆరోగ్య వివరాలతో కూడిన ఐడీకార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ ఐడీ కార్డుల్లో సభ్యుల పూర్తి ఆరోగ్య వివరాలుంటాయన్నారు. గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు, పరీక్షలు, చికిత్సల వివరాలతో కూడిన హెల్త్ ప్రొఫైల్‌ను తయారుచేయాలని, సాంకేతికంగా ఉన్నతంగా ఈ ఐడీలను రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు.

ఐడీకార్డుతో ఏడాదికొకసారి వైద్యపరీక్షలు చేస్తారని, దీనివల్ల వైద్యుల దగ్గరకు వెళినప్పుడల్లా  వైద్యపరీక్షలు చేయించుకునే సమస్యల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ ఐడీ కార్డులపై మహిళల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ‘వీ హబ్’ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే వారు అప్పులు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారని, కానీ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు అప్పు ఇస్తే ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ  రాష్ట్ర ఆడబిడ్డల సొంతమని ప్రశంసిం చారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తమ ప్రభు త్వం పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. ఇండియా చైనా యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినపుడు ఇందిరమ్మ మహిళాశక్తిని ప్రపంచానికి చాటారన్నారు. దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తేనని చెప్పారు. 

మహిళాశక్తికి కాంగ్రెస్ చేయూత..

మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదని, దేశానికి మహిళలు ఆదర్శంగా ఉన్నారని, మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించినా ఘనత కాంగ్రెస్‌దేనని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం మహిళాశక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలకు సోనియమ్మ నజరానా అందించారని, మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామని, విద్యార్థుల యూనిఫార్మ్ కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా అందిం చినట్లు వివరించారు.  వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని,  పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.  అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి అన్నారు.  

ఆడబిడ్డల ఆత్మగౌరవంతోనే రాష్ట్ర పురోగతి..

శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్‌ను కేటాయించామని, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ర్టం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని తాము నమ్ముతున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సం ఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచుకోవాలని కోరుతున్నానన్నారు.

ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. మహిళలు సమర్థవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నట్లు చెప్పారు. 

పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో 67లక్షల మంది మహిళలు ఉన్నారని, కోటీమంది చేర్చేలా ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు.