18-05-2025 12:07:10 AM
వెండితెరపై కొన్ని క్రేజీ జోడీలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. అనుకోకుండానే ఆ జంటపై అభిమానం పెరిగిపోతుంది. దీంతో వారి కాంబినేషన్‌ను మళ్లీమళ్లీ చూసేందుకు ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. అలాంటి వాళ్ల కోరిక త్వరలో తీరబోతోంది.. అభిమాన జంటను తెరపై చూసే భాగ్యం కలిగే రోజు మరెంతో దూరంలో లేదు. ఔను, కొన్ని క్రేజీ జంటలు వన్స్‌మోర్ అంటూ తెరపై సందడి చేయనున్నాయి.
ప్రభాస్‌తో అనుష్క.. దీపికా పదుకొణె
ప్రభాస్, అనుష్క కలయికకు సక్సెస్ పర్సంటేజీ ఎక్కువ. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ఈ జంట మళ్లీ తెరపై తారపడిందేలేదు. అయితే వీరిద్దరూ మరోమారు తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారట. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా ఒక పాత్ర కోసం సౌత్ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని సందీప్‌రెడ్డి వంగా భావిస్తున్నారట. పైగా సెకండాఫ్‌లో వచ్చే ఆ పాత్ర కథలో కీలకంగా ఉంటుందని సమాచారం.
అందుకే ఈ పాత్రను అనుష్కతో చేయించాలని సందీప్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారట. ఇదే నిజమైతే ఈ జంటను ఇష్టపడేవాళ్లకు ‘స్పిరిట్’ ఓ కన్నుల విందు కానుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా ఇప్పటికే దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. ఇదివరకు ‘కల్కి2898ఏడీ’లో కలిసి స్క్రీన్ పంచుకున్నారు ప్రభాస్, దీపికా పదుకొణె. అయితే అప్పుడు జంటగా కాకుండా ఎవరి పాత్రల్లో వారు నటించారు. ఇప్పుడు వీళ్లిద్దరూ నాయకానాయికలుగా కనిపించనున్నారట.
విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా..
కొంతమంది ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోతుంటారు. అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిన జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరూ ‘గీత గోవిందం’లో పండించిన కెమిస్ట్రీని ఆడియన్స్ ఎప్పుడూ మర్చిపోలేరు. ఆ తర్వాత చేసిన ‘డియర్ కామ్రేడ్’కు కూడా స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. వీరిద్దరు కలిసి మరోసారి ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు ఆ టైమ్ రానే వచ్చింది. విజయ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను రూపొందిస్తోంది. ఇందులో రష్మిక నాయికగా నటిస్తోంది.
చిరంజీవితో ముచ్చటగా మూడోసారి
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరైన శివశంకర వరప్రసాద్ అనే పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇందులో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నట్టు సమాచారం. జూన్ నుంచి చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున టీమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తోంది. నటీనటుల ఎంపిక ప్రక్రియను సైతం శరవేగంగా నిర్వహి స్తోంది.
అయితే, ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా, ఓ పాత్ర కోసం నయనతారను ఖరారు చేశారు. శనివారం ‘మెగా157’ టీమ్ చిరంజీవికి జోడీగా నయనతారను హీరోయిన్‌గా పరి చయం చేయడానికి ఓ వీడియోను రిలీజ్ చేశారు. నయనతార పాత్ర రిఫ్రెషింగ్‌గా, మెమరబుల్‌గా ఉంటుం దట. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుందట. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కావడానికి టార్గెట్‌గా పెట్టుకున్నారు. దర్శకుడు కొత్త ప్రమోషనల్ వీడియో ద్వారా ‘సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అని చెప్పడంతో మరోసారి కన్‌ఫర్మ్ చేశారు. ఇదిలా ఉండగా చిరంజీవి జోడీ ఇదివరకు సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్ సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే.
మెగాస్టార్‌తో కేథరిన్ కూడా!
అయితే ఇందులో మరో కీలక పాత్ర కోసం కేథరిన్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. ఈమె ఇదివరకు చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో నటించింది. కాకపోతే రవితేజ భార్య పాత్రను పోషించింది. ఇప్పుడీ సినిమాలో కేథరిన్‌కు చిరుతో రెండోసారి స్క్రీన్ పంచుకునే అవకాశం దక్కనుంది. ఈ కథలో కేథరిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని.. సినిమా ఆద్యంతం ఆమె కనిపిస్తుందట. నయన్, కేథరిన్‌లతోపాటు మరో యువ కథానాయిక కూడా ఇందులో కనిపించే అవకాశాలున్నట్టు టాక్.
బేబీతో రెండోసారి ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో వచ్చిన ‘బేబీ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సాయి రాజేశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మారుతి, ఎస్‌కేఎన్ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిండమే కాకుండా పలు అవార్డులు సైతం రాబట్టింది. తాజాగా ఈ హిట్ కాంబో మరో సినిమాతో రాబోతోంది. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమాకు ఈ నెల 15న పూజా కూడా పూర్తయ్యింది. ఇది ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోందట. ‘90స్’ వెబ్‌సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.