calender_icon.png 8 October, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన బస్సుచార్జీలను తగ్గించాలి

08-10-2025 12:09:59 AM

  1. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 

ఎల్బీనగర్, అక్టోబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ తదితరులు మంగళవారం గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికు లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తూ... చార్జీలు పెంచి, పురుషులపై మోయలేని ఆర్థిక భారం వేసిందన్నారు. హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు టికెట్ ధరలు భారీగా పెంచిందని విమర్శించారు. మొదటి 3 స్టేజీలకు రూ.5, ఆ తర్వాత వచ్చే స్టేజీలకు రూ.10కి పెంచారని తెలిపారు. సిటీ బస్సు చార్జీలను ఏకంగా ఒకేసారి రూ, 10  పెంచి పేద, మధ్యతరగతి ప్రయాణికులపై తీవ్ర ఆర్థిక భారం మోపిందన్నారు.

ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలపై నెలకు రూ , 500 అదనపు భారం మోపిందని మండిపడ్డారు. రాజధాని ప్రజల నడ్డివిరిచి ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయల భారం వేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు ఆరోపించారు.  ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసీని గట్టెక్కించాల్సిన ప్రభుత్వం సామాన్య ప్రయాణికుల నడ్డి విరిచాలని చూడడం క్షమించరానిదన్నారు.