16-08-2025 12:17:32 AM
హనంకొండ/కెయు క్యాంపస్,(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి కే ప్రతాపరెడ్డి జాతీయజెండా ఎగరేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం వి సి మాట్లాడుతూ అన్ని రంగాలతో పాటు అకాడమిక్ పరంగా కాకతీయ విశ్వవిద్యాలయం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. పరిపాలన భవనం ప్రాంగణంలో రిజిస్టర్ ఆచార్య వి.రామచంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్ల గౌరవ వందనం స్వీకరించి ఆయన జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకల్లో పాలకమండలి సభ్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు ,బోధన, బోధ నేతర సిబ్బంది,విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న మానవ ఆర్థిక, భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించి కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లే విధంగా కృషి చేయాలి అన్నారు. ఇది ఎంతోమంది ఆశయ సాధన కేంద్రమైందని, తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయం పాత్ర మరువలేనిది అన్నారు.
ఇటీవల విజయవంతంగా నిర్వహించిన టి జి ఎడ్సెట్ 2025 మరియు 23వ స్నాతకోత్సవ విశ్వవిద్యాలయ నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం అన్నారు. రూసా నిధులతో జాతీయస్థాయి పరిశోధనలకు వసతులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఆచార్య ఎన్ ప్రసాద్, ఆచార్య ఇస్తారి నేతృత్వంలో పరిశోధనల ద్వారా పేటెంట్లు నమోదయినట్లు తెలిపారు. ఫార్మసీ కళాశాలకు హెచ్ఎంటీవీ అవార్డు లభించిందని, ఒప్పంద అధ్యాపకులు డాక్టర్ టి.రాధిక, ఆచార్య పీ.మల్లారెడ్డి, ఆచార్య పి.శ్రీనివాసరావు, ఆచార్య సి.జి. శ్రీలత, రిజిస్టర్ ఆచార్య వి.రామచంద్రం లాంటి అధ్యాపకులు ప్రతిష్టాత్మక అవార్డులు పొందారని గుర్తు చేశారు.
కామర్స్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని మాచర్ల కృష్ణవేణి పదవ హాస్య టైక్వాండో ఛాంపియన్షిప్ లో కాంస్య పతాకం సాధించిందని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కృతిక ఉత్తమ వాలంటీర్ గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గుర్తింపు పొందడం గర్వకారణం అన్నారు. అలాగే విశ్వవిద్యాలయం ఎన్సిసి క్యాండెట్ డి.ప్రశాంత్ రిపబ్లిక్ డే పెరేడ్ ఎంపిక కావడం విశేషం అని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఇతర విభాగాల్లో ప్రాంగణ నియమకాలు విజయవంతంగా పూర్తయ్యా యని తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ అడుగుపెడుతుండగా త్వరలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేష్ లాల్, డాక్టర్ బి.రమ, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ సుకుమారి, డీన్లు, ప్రిన్సిపల్, విభాగాధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, బోధనేతర ఉద్యోగులు, విశ్రాంత అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా బోధన, బోధ నేతర, విశ్రాంత ఉద్యోగుల మధ్య నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్ నుండి విద్యార్థులకు మరియు ఉద్యోగుల కోసం ఫేస్ రికగ్నిషన్ హాజరు వ్యవస్థ అమలు చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ అన్నారు.