14-01-2026 01:23:00 AM
నేడు భారత్, కివీస్ రెండో వన్డే
తుది జట్టులో మార్పులు
నితీష్, అర్షదీప్‌కు ఛాన్స్
కింగ్ కోహ్లీ సూపర్ ఫామ్ కొనసాగుతున్న వేళ, కెప్టెన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ టచ్‌లోకి వచ్చిన వేళ కొత్త ఏడాదిలో తొలి సిరీస్ విజయానికి భారత్ అడుగుదూరంలో నిలిచింది. తొలి వన్డే విజయం జోష్ ఇచ్చినా బౌలర్లు పూర్తి స్థాయిలో రాణించకపోవడం ఒక్కటే మైనస్.. అది సరిచేసుకుని రాజ్‌కోట్‌లోనూ చెలరేగితే వన్డే సిరీస్ సొంతమవడం ఖాయం.. మరోవైపు కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగి భారత్‌ను కంగారు పెట్టిన కివీస్ సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.
రాజ్‌కోట్ , జనవరి 13: భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేకు అంతా సిద్ధమయింది. రాజ్‌కోట్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరగబోతోంది. తొలి వన్డే గెలిచి జోరు మీదున్న టీమిండియా సిరీస్ టార్గెట్‌గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ తప్పిస్తే కోహ్లీ, గిల్, శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నారు. 2027 వన్డే వరల్ కప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ దానికి తగ్గట్టే అదరగొడుతున్నాడు. తన ఫామ్‌పై ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ దుమ్ము రేపుతున్నాడు. ఆసీస్ టూర్‌లో, తర్వాత సౌతాఫ్రికా సిరీస్‌లో చెలరేగిపోయాడు.
ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ దానిని కంటిన్యూ చేస్తున్నాడు. తొలి వన్డేలో తృటిలో సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ ఇదే జోరు కొనసాగిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా... గిల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఇక రీ ఎంట్రీలో శ్రేయాస్ అయ్యర్ కూడా రాణించాడు. హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా మ్యాచ్‌ను ఫినిష్ చేసారు. అయితే రెండో వన్డేకు తుది జట్టులో రెండు మార్పులు జరగనున్నాయి. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ సిరీస్‌కు దూరమయ్యాడు.
రీప్లేస్ మెంట్‌గా ఆయుష్ బదోనీ ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో నితీష్‌కుమార్‌రెడ్డికి చోటు దక్కే ఛాన్స్ ఉంది. అలాగే తొలి వన్డేలో మన బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. మరీ ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ విఫల మయ్యాడు. దీంతో అతన్ని తప్పించి అర్షదీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన కాంబినేషన్‌ను మార్చే పరిస్థితి లేదు. అయితే సిరాజ్ కొత్త బంతితో మరింత ప్రభావం చూపాల్సి ఉంది. అతనితో పాటు స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది.
మరోవైపు న్యూజిలాండ్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో బాగానే ఆకట్టుకుంది. భారత్‌ను కంగారు పెట్టిందనే చెప్పాలి. ఆ జట్టు బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. అలాగే మధ్య ఓవర్లలో తడబడినా చివర్లో పుంజుకుని భారీ స్కోర్ సాధించారు. దీంతో సిరీస్ సమం చేసే అవకాశం వారికీ ఉంది.
పిచ్ రిపోర్ట్ :
రాజ్‌కోట్ పిచ్ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. అలాగే మంచు ప్రభావం ఉంటే మాత్రం చేజింగ్ జట్టుకు కలిసొచ్చే అంశం.
తుది జట్లు (అంచనా) :
భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయాస్‌అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్‌రెడ్డి, జడేజా, హర్షిత్‌రాణా, సిరాజ్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
న్యూజిలాండ్ : డేవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్ వెల్(కెప్టెన్), జాక్ఫౌక్స్ క్లార్క్, జెమీసన్, ఆదిత్య అశోక్.