14-01-2026 01:17:13 AM
నవీ ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్ 2026(డబ్ల్యూపీఎల్)లో భాగంగా గుజరాత్ జెయిం ట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఇండియన్స్‌కి ఇది రెండో విజయం. అమన్‌జ్యోత్ కౌర్ 26 బంతుల్లో 40 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 71* , నికోలా కెరీ 23 బంతుల్లో 38*, మాథ్యూస్ 12 బంతుల్లో 22 పరుగులు, జి.కమలిని 12 బంతుల్లో 13 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్, కష్వీ గౌతమ్, సోఫీ డివైన్ తలో వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది.
గత రెండు మ్యాచ్లలో మెరుపులు మెరిపించిన సోఫీ డివైన్.. ముంబైపై మాత్రం నామమాత్రపు పరుగులే చేసింది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డివైన్ ఔటైంది. ఐదో స్థానంలో వచ్చిన జార్జియా వేర్హామ్ (43*; 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కనికా అహుజా (35; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), బెత్ మూనీ (33; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), భారతీ పుల్మాలి (36*; 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. ఆయుషి సోనీ (11) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. 9 ఓవర్లకు 96/2తో ఉన్న గుజరాత్.. 17 ఓవర్లకు 143/5తో నిలిచింది. మ్యాచ్ చివర్లో భారతి చెలరేగింది. దీంతో ఆఖరి మూడు ఓవర్లలో ఆ జట్టు 49 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, అమీలియా కేర్, కారీ తలా వికెట్ సాధించారు.