30-08-2025 01:45:04 AM
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీపరంగా బీసీలకు 42 శాతం కేటాయిస్తామంటే ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని, పార్టీపరమైన రిజర్వేషన్ వద్దని స్పష్టం చేశారు. పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తే, ఇక 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపినట్లని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని సచివాలయ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పించేందుకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మంత్రి మండలి మొత్తం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని, గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు, అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయాలని కోరారు. అలాగే బీసీ కోటాపై తక్షణం రాష్ట్రప్రభుత్వం అఖిలపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీపరమైన రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.
బీసీ కోటా పెంచలేకపోతే రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కులగణనకు అర్థమే ఉండదని అభిప్రాయపడ్డారు. కులగణన దేశానికే రోల్డ్ మోడల్ అని చెప్పి, ఇప్పుడు పార్టీ పరంగా కోటా ఇస్తామనడం ఓల్డ్ మోడల్ అవుతుందని ఎద్దేవా చేశారు. బీహార్‌లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావాలంటే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను పెంచాలని, అలా చేస్తేనే బీహార్ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసిస్తారని వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్లు పెంపునకు సహకరించని రాజకీయ పార్టీలను ప్రజలు గుర్తిస్తారని, వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, ఇతర బీసీ నేతలు తాటికొండ విక్రమ్‌గౌడ్, ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, మాదేశి రాజేందర్ పాల్గొన్నారు.