calender_icon.png 22 January, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేక్ ఆడించిన అభిషేక్

22-01-2026 01:12:02 AM

భారత్‌దే తొలి టీ20

సూర్యకుమార్, హార్థిక్ మెరుపులు

చివర్లో రింకూ సింగ్ విధ్వంసం

ఛేజింగ్‌లో చేతులెత్తేసిన కివీస్

టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు అదిరిపోయే ఆరంభం..బ్యాటర్లు చెలరేగిన వేళ నాగ్‌పూర్ టీ20లో పరుగుల వరద..ఆరంభం నుంచే అభిషేక్ కివీస్ బౌలర్లను షేక్ ఆడిస్తే.. సూర్యకుమార్,హార్థిక్ మెరుపులు మెరిపించారు. ఇక చివర్లో రింకూసింగ్ విధ్వంసం మామూలుగా లేదు. ఫలితంగా 239 పరుగుల టార్గెట్‌ను కివీస్ ముందుంచిన టీమిండియా తర్వాత బంతితోనూ అదరగొట్టి సిరీస్‌లో బోణీ కొట్టింది.

నాగ్‌పూర్, జనవరి 21 : టీ ట్వంటీ వరల్ కప్ కు చివరి రిహార్సల్‌గా ఉన్న న్యూజిలాండ్ సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, రింకూ సింగ్ విధ్వంసం సృష్టించిన వేళ నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. హార్థిక్, బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. ఇషాన్ కిషన్‌కు కూడా చోటుదక్కింది. సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8) పరుగులకే ఔటవడగా పవర్ ప్లేలోనే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి జట్టు స్కోరును టాప్ గేర్ లో నడిపించాడు. గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతన్ని ఇన్నింగ్స్ ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువగా ఉన్నాయి. వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. అటు సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా రోజుల తర్వాత టచ్‌లోకి వచ్చాడు. 22 బంతుల్లో 32 (4 ఫోర్లు, 1సిక్స్) పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత హార్థిక్ పాండ్యా(25) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. అభిషేక్ శర్మ 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

అతనికి ఈ మైలురాయిని అందుకునేందుకు కేవలం 2998 బంతులే అవసరమయ్యాయి.  అయితే చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 220 లోపే ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్నారు. ఈ దశలో రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.  రింకూ కేవలం 20 బంతుల్లోనే 44 పరుగులు చేసాడు. ముఖ్యంగా మిచెల్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతడు తన 4 ఓవర్ల స్పెల్ లో 27 పరుగులకు 2 వికెట్లు తీసాడు. కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది.

కాన్వే డకౌటవగా...వెంటనే రచిన్ రవీంద్ర కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రాబిన్ సన్ , గ్లెన్ ఫిలిప్స్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. రాబిన్ సన్ ఔటైన తర్వాత ఫిలిప్స్ , చాప్ మన్ కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. సాధించాల్సిన రన్‌రేట్ చాలా ఎక్కువగా ఉండడంతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫిలిప్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..చాప్ మన్ 39 రన్ కు ఔటయ్యాడు. తర్వాత ఫిలిప్స్ 78 పరుగులకు ఔటైన వెంటనే డారిల్ మిచెల్, శాంట్నర్ దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. అప్పటికే కివీస్ ఓటమి ఖాయమైపోయింది. చివరికి న్యూజిలాండ్ 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, దూబే 2,  అక్షర్ పటేల్, హార్థిక్ , అర్షదీప్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో 1-- ఆధిక్యంలో నిలిచింది. 

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్: 238/7 (అభిషేక్ శర్మ 84, రింకూ సింగ్ 44 నాటౌట్, సూర్యకుమార్ 32, హార్థిక్ పాండ్యా 25; డఫీ 2/27, జేమీసన్ 2/54)

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 190/7 ( గ్లెన్ ఫిలిప్స్ 78, చాప్‌మన్ 39, డారిల్ మిచెల్ 28; దూబే 2/28, వరుణ్ చక్రవర్తి 2/37)