calender_icon.png 12 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరంభం అదిరేనా?

11-01-2026 12:00:00 AM

నేడు కివీస్‌తో భారత్ తొలి వన్డే

శ్రేయాస్ పైనే అందరి చూపు

పంత్‌కు ప్లేస్ డౌటే

తుది జట్టులో నితీశ్‌కు చోటుపై సస్పెన్స్

ఆల్‌రౌండర్ రేసులో వాషింగ్టన్ సుందర్

కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సిరీస్‌కు రెడీ అయింది. మూడు వారాల బ్రేక్ తర్వాత వన్డే సిరీస్‌తో సీజన్  మొదలుపెట్టబోతోంది. గత ఏడాది కివీస్ చేతిలో టెస్ట్ ఫార్మాట్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. రీఎంట్రీలో శ్రేయాస్ అయ్యర్ ఎలా ఆడతాడో అన్న ఆసక్తి మధ్య కెప్టెన్ శుభమన్ గిల్ ఫామ్ అందుకోవడంపైనా అందరి చూపు ఉంది. అలాగే తుది జట్టు కూర్పులో పంత్‌ను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరీస్‌లో శుభారంభం కోసం ఇరు జట్లు పట్టుదలగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరును అంచనా వేస్తున్నారు.

వడోదర, జనవరి 10 : భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు అంతా సిద్ధమైంది. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత కొన్ని రోజులు రిలాక్సయిన భారత క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగారు.  కివీస్‌తో వన్డే సిరీస్ కు ముందు దాదాపు అంద రూ ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నారు. కోహ్లీ, రోహిత్, గిల్, పంత్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇలా ప్రస్తుత సిరీస్‌లో ఉన్నవారంతా విజయ్ హజారే ట్రోఫీలో కనీసం 2 మ్యాచ్‌లు ఆడారు. ఈ వన్డే సిరీస్ కోసం మూడు రోజుల ముందే వడోదరకు చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన టీమిండియా సీనియర్లపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోకో జోడీ ప్రస్తుతం వన్డే ఫార్మా ట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా సిరీస్, ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌లోనూ అదరగొట్టిన వీరిద్దరూ విజయ్ హజారే ట్రోఫీలోనూ దుమ్మురేపారు. దీంతో రోకో జోడీ తమ ఫామ్ కొనసాగిస్తారని భావిస్తున్నారు. అటు ఆసీస్ టూ ర్‌లో గాయపడి ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న శ్రేయా స్ అయ్యర్ పైనా అంచనాలున్నాయి. వన్డేల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు శ్రేయాస్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. టీ ట్వంటీ తరహా హిట్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎటు వంటి ఇబ్బందీ లేకుండా ఆడడంతో వన్డే సిరీస్‌కు క్లియరెన్స్ దక్కింది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ భారత కెప్టెన్ శుభమన్ గిల్‌కు కూడా అగ్నిపరీక్షగా మారిం ది.

పేలవ ఫామ్ తో సతమతమవుతున్న గిల్ విజయ్ హజారే లోనూ నిరాశపరిచాడు. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన గిల్ తాను వ్యక్తిగతంగా ఫామ్ అందుకోవడం చాలా కీలకమనే చెప్పాలి. ఇక భారత జట్టు కూర్పులో కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు ఖా యం. గత కొంతకాలంగా వికెట్ల వెనుక, బ్యాట్‌తోనూ అద్భుతంగా రాణిస్తున్న రాహుల్ నే కీపర్‌గా కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. అలాగే ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పోటీపడుతున్నారు.

వరుస అవకాశాలు ఇస్తున్నా నితీశ్ రెడ్డి సద్వినియోగం చేసుకోవడం లేదు. దీంతో ఈ సిరీస్ అతనికి కూడా కీలకమని భావిస్తున్నా రు.  స్పిన్ విభాగంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్‌కు చోటు ఖాయం.  పేస్ విభాగంలో బుమ్రా లేకపోవడంతో చోటు దక్కించుకున్న సిరాజ్ ఎలా రాణిస్తాడో చూడాలి. అలాగే అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. మరోవైపు మిఛెల్ బ్రేస్ వెల్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్‌కు ఆల్ రౌండర్ల కీలకం కాబోతున్నారు. కాన్వేతో పాటు డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్‌పై అంచనాలున్నాయి. బౌలింగ్‌లో కైల్ జేమీసన్‌తో పాటు భారత మూలాలున్న ఆదిత్య అశోక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడు. 

గత రికార్డులు :

వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటి వరకూ 120 మ్యాచ్‌లలో తలపడితే భారత్ 62 సార్లు గెలిచింది. న్యూజిలాండ్ 50 మ్యా చ్‌లలో గెలవగా.. ఏడు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఒక వన్డే టైగా ముగిసింది.

పిచ్ రిపోర్ట్ :

వడోదర పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే పేసర్లకు కాస్త అడ్వాంటేజ్ లభించొచ్చు. మంచు ప్రభావం ఉండనుండడంతో ఛేజింగ్ జట్టుకు కలిసొస్తుందని భావిస్తున్నారు.

మ్యాచ్ మ. 1:30కు ప్రారంభం