20-11-2025 12:38:17 AM
సంగారెడ్డిలో ఘనంగా జయంతి వేడుకలు
సంగారెడ్డి, నవంబర్ 19(విజయక్రాంతి): ప్రపంచం గుర్తించిన నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొనియాడారు. బుధవారం ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు ఇందిరాగాంధీతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మెదక్ పార్లమెంట్ నుండి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యారని, అప్పటి మెదక్ జిల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు రామచంద్రా రెడ్డి, బాగారెడ్డి కోరిక మేరకు ఇక్కడి నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఆమె ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సంగారెడ్డికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని తెచ్చారని, అంతేగాకుండా బీడీఎల్, ఇక్రిశాట్ మంజూరు చేశారన్నారు. ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు.
గరీబి హాటావో నినాదంతో ఈ దేశంలో పేదరికాన్ని పారదోలారని, భూమిలేని నిరుపేదలకు, రైతులకు భూములు పంచారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలకు ఇండ్ల స్థలాలు పంచారని, రోటీ, కపడా ఔర్ మకాన్ నినాదంతో దేశంలోని నిరుపేదల స్థితిగతులను మార్చేందుకు కృషి చేశారన్నారు. ఈ దేశం కోసం రక్తమిస్తామని, ప్రాణాలిస్తామని బీజేపీ నేతలు మాట్లాడుతుంటారని, కానీ ఏ బీజేపీ నాయకుడు ఇంతవరకు ఎవరూ ప్రాణత్యాగం చేశారో చెప్పాలన్నారు. అనంతరం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.