calender_icon.png 7 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

07-11-2025 12:34:08 AM

కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, నవంబర్ 6 (విజయక్రాంతి) : జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం  జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో  స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి హౌసింగ్ అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవో లతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో  ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి? వాటిలో ఎన్ని బేస్ మెంట్, రూఫ్, స్లాబ్ దశల్లో  ఉన్నాయి ? ఇంతవరకు ఎన్ని  పూర్తయ్యాయి? అని  హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు.  మండలాల వారీగా ఎంపిడివోలకు ఇచ్చిన ఇండ్ల నిర్మాణాలలో ఎవరెవరు లక్ష్యం చేరుకున్నారని ఎంపిడివోలను ప్రశ్నించారు.

లక్ష్య సాధనలో  వెనకబడి ఉన్న నర్వ, మరికల్, మక్తల్ మండలాల ఎంపిడివో లను కలెక్టర్ వివరణ కోరారు.  ఆయా ఎంపిడివోలు ఇసుక, మొరం, వర్షాల కారణంగా ఇండ్ల నిర్మాణాలకు ఆటంకం కలిగిందని తెలపగా,  అత్యధికంగా వర్షాలు కురిసిన ఇతర జిల్లాల్లోనే  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, కానీ మన జిల్లాలో  ఇలాంటి కారణాలతో నిర్మాణాలు నిలిచి పోయాయని చెప్పడం సరి కాదన్నారు.

అనంతరం ఇందిరా డైరీ షీప్ ఫామింగ్ స్కీమ్ కింద కొడంగల్ నియోజక వర్గంలోని మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాలతో పాటు మద్దూరు, కోస్గి  మున్సిపాలిటీలలో 631  అప్లికేషన్స్ లు వచ్చాయని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎం.ఏ రషీద్  కలెక్టర్ కు వివరించారు. వచ్చిన  అప్లికేషన్స్ లను ఆయా మండలాల ఎంపీడీవో లు వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఎంపీడీవోలు గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆస్తి పన్నుల వసూళ్ల పై  ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె తెలి పారు. పంచాయతీ కార్యదర్శులు రోజూ నిర్ణీత సమయంలోపు గ్రామాలకు చేరుకుంటున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాల నివారణకు  సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. అన్ని గ్రామా పంచాయతీ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో  హెల్ప్ లైన్ నంబర్ ను రెండు రోజుల్లో రాయించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో డిఆర్డిఓ మొగులప్ప, హౌసింగ్ డీ. ఈ, అన్ని మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.