18-10-2025 12:03:29 AM
కీసర ,అక్టోబర్ 17(విజయక్రాంతి ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధిలోని రాంవల్లి వద్ద హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విగ్రహం ఎడమ చేయి, గదను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పరిస్థితిని సమీక్షించి స్థానికులను శాంతింపజేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగు లను త్వరలో పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.ఈ ఘటనతో రాంవల్లిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలోని హిందూ దేవాలయాలు, ఉత్సవ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కావాలనే మత సామరస్యానికి విఘాతం కలిగించేలా దాడు లు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.హైదరాబాదులో హిందూ దేవాలయాలు, ఉత్సవ మూర్తుల విగ్రహాలపై దాడులు పెరగడం ఆందోళనకరమని ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను 24 గంటల్లోగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు