16-06-2025 01:49:37 AM
-భద్రాద్రి కొత్తగూడెం మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాకుబ్ పాషా
భద్రాద్రికొత్తగూడెం , జూన్ 15 (విజయక్రాంతి); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన కుల గణన సర్వేలో ముస్లిం జనాభా గణాంకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా ఆరోపించారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ&2011లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే ప్రకారం తెలంగాణలో ముస్లిం జనాభా 44,64,852గా ఉండగా,2024లో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో ఈ సంఖ్య 44,57,012గా మాత్రమే చూపించడం విస్మయకరమని ఆయన పేర్కొన్నారు.
13 సంవత్సరాల వ్యవధిలో జనాభా పెరగకపోగా, సుమారు 7,840 మంది ముస్లిం జనాభా తగ్గిపోయినట్లు సర్వే గణాంకాలు చూపడంపై యాకూబ్ పాషా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనాభా ఎక్కడైనా పెరుగుతుంది కానీ తగ్గడం ఏమిటి? ఈ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే వివరాలను బహిర్గతం చేయడం లేదన్నారు. ముస్లిం జనాభా గణాంకాల తగ్గింపు వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలకు రిజర్వేషన్ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
2011 కేంద్ర ప్రభుత్వ సర్వే ఆధారంగా మైనారిటీ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించబడుతుండగా, తాజా సర్వే ఫలితాలు ఈ పథకాలపై ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే నివే దికలకు బదులుగా, కేంద్ర ప్రభుత్వం 2011 సర్వే ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని యా కూబ్ పాషా కోరారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, తగ్గిన ముస్లిం జనాభా గణాంకాలపై సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ముస్లిం సమాజానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు హుస్సేన్ ఖాన్, సలీం, ఆసిఫ్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.