21-05-2025 12:13:47 AM
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు -చేసిందని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణతో పాటు భవిష్య త్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవార ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణ కమిటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరా బాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఉన్నారు. ఈ నెల 18న జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై ఈ కమిటీ విచారణ జరిపి ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక ఇస్తుందని మంత్రి పొన్నం తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు సూచనలు చేయడంతో పాటు స్థానిక పరిస్థితులు అంచనా వేసి ఇలాంటి ఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం సీఎం, ఉప ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు తీసుకోనున్నారని మంత్రి పొన్నం వెల్లడించారు.
పాతబస్తీలో మరో అగ్ని ప్రమాదం
పాతబస్తీ ఛత్రినాక సమీపంలోని బోయగుడలో మంగళవారం మధ్యా హ్నం మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి రెండు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో నివసించే వారు బయటకు పరుగులు తీశారు. ఫైర్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మొగల్పుర ఫైర్ స్టేషన్ అధికారి భిక్షపతి ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకొని జి ప్లస్ టు భవనంలో మంటలను ఆర్పివేశారు.
అయితే ఈ భవనంలో చెప్పుల గోదాం కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే చెప్పులు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. సకాలంలో స్పందించిన ఫైర్ ఇంజన్ సిబ్బందిని ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌వర్మ అభినందించారు.
క్లూస్‌టీంతో విచారణ
విచారణ కమిటీ సభ్యులు మంగళవారం క్షేత్ర స్థాయిలో క్లూస్ టీంతో కలిసి విచారణ జరిపి, వివరాలు సేకరించారు. భవనంలో 14 ఏసీలు ఉండగా 7 ఏసీలు నిరంతరం పని చేయడం వల్ల ప్రమాదం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రమాద కారణాలను గుర్తించిన దర్యాప్తు క్లూస్‌టీం ఏసీలో హెవీ లోడ్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. అగ్ని ప్రమాదంలో భవన గోడలు బీటలు వారినట్లు గుర్తించారు. భవనం శిథిలావస్థకు చేరుకున్నదని, నివాసానికి మంచిది కాదననే భావనకు వచ్చారు.