21-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన కమిటీ జంబోజట్టుగానే ఉండబోతోంది. పార్టీ పదవుల్లో సామాజికన్యాయం పాటిస్తూనే..అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ.. ఎక్కువ సంఖ్యలో పార్టీ పదవులు అప్పగించాలనే యోచనలో ఉన్నా రు. ప్రధానంగా బీసీలకు 42 శాతానికి పైగా పార్టీ పదవుల్లో చోటుకల్పిస్తూనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన చేస్తున్నారు.
అందుకు పార్టీ అధిష్ఠానం పెద్ద కసరత్తే చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను వారం రోజుల క్రితం ఢిల్లీకి పిలిపించుకుని జాబితాపై చర్చించి ఫైనల్ చేసినట్లుగా పార్టీవ ర్గాలు చెబుతున్నాయి. ఈ వారం, పది రోజుల్లోనే పార్టీ పదవుల పందేరాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొత్త కమిటీలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్, 30 మంది వరకు పీసీసీ ఉపాధ్యక్షులు, 60 నుం చి 70 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శులను నియమించే అవకాశం ఉంది. ఇక కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో పాటు పీసీసీ ప్రచార కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమ లు కమిటీలతో పాటు పార్టీ అనుబంధ సం ఘాల కమిటీలను కూడా ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇక పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ ఉండటంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవు ల్లో రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురు ఉన్నారు. కొత్త కమిటీలో నలుగురికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం చాలా మంది పోటీపడుతున్నారు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి భువ నగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం రోహిన్‌రెడ్డికే అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇక ఎస్సీ సామా జిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బల రాంనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక మైనార్టీల నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి అత్యం త సన్నిహితంగా ఉండే ఫహీమ్, నాంపల్లి నుంచి పోటీచేసి ఓటమి చెందిన ఫిరోజ్‌ఖాన్‌లో ఒకరికి దక్కే అవకాశం ఉంది. ఫహీమ్ పేరు విషయంలో పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పాత కమిటీలో పీసీసీ ఉపాధ్యక్షులుగా, పీసీసీ ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ అనుబంధ సంఘా లకు అధ్యక్షులుగా ఉన్నవారిలో చాలా మం దికి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా ఎన్నికయ్యారు. వీరికి పార్టీలో పదవుల్లో చోటు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారు.