21-05-2025 12:20:46 AM
కరీంనగర్/పెద్దపల్లి, మే 20 (విజయక్రాంతి)/భీమారం (చెన్నూర్): భూ భారతి చట్టాన్ని అమలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్ స్థాయి అధికారులు పర్యటించి, భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
అన్యాక్రాంతానికి గురైన పేదల భూములను వెనక్కి తీసుకొని పేదలకు అందిస్తామన్నారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన ఆర్‌ఓ ఆర్ చట్టం 2025 ప్రజలకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామంలో భూ భారతి చట్టం--2025 పై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా ఎలి గేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో అవగాహన సదస్సుకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోగా వీలైనంత వరకు జఠిలమైన శాశ్వత సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టం ఉపయోగప డుతుందన్నారు.
6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఈ నెల 27వ తేదీన ఫైనల్ చేస్తామన్నారు. వారికి 3 నెలల శిక్షణ ఇచ్చి ప్రతి మండలానికి 8 మంది తగ్గకుండా సర్వేయర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లు 4 లక్షల 50 వేలు ప్రకటించామని, ఈ నెలాఖరులోపు లబ్ధిదారులను ప్రకటిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,872 మంది చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంతో అదనంగా అక్కడే ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు మం జూరు చేస్తామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి 3 సంవత్సరాలు గడిచినా రూల్స్ తీసుకుని రాలేదని, తమ ప్రభుత్వం భూ భారతి చట్టం రూల్స్ ప్రవేశపెట్టిందని, ఈ నిబంధనల ప్రకారం సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ధరణి స్థానంలో భూ భారతి తీసుకొస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం తెచ్చామన్నారు.
భూభారతితో దరిద్రం పోయింది: మంత్రి శ్రీధర్‌బాబు
భూభారతి చట్టంతో రాష్ట్ర ప్రజల దరిద్రం పోయిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గతంలో సాగు నీరు కోసం రైతుల తరఫున పోరాటం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నేడు ప్రజాప్రతినిధిగా ఉండటం సం తోషంగా ఉందని అన్నారు. ఎస్సారెస్పీ డీ 83, డీ86 కాల్వల కింద పూర్తి స్థాయి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని చెప్పారు.
కాగా గతంలో ఇందిరాగాంధీ అమెరికా నాయకత్వం ఎదిరించిందని శ్రీధర్‌బాబు అన్నారు. నేడు అమెరికా ఒత్తిడికి తలొగ్గి రాజీపడటం దురదృష్టకరమన్నారు. సరిహద్దుల అంశంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు అందిస్తామని స్పష్టం చేశారు.
ఘనపూర్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, దొంత సుధాకర్, నిర్మలా జయరాజ్, ముప్పిరితోటలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు పాల్గొన్నారు. భీమారంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు.