12-07-2025 12:41:09 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
హనుమకొండ, జులై 11 (విజయ క్రాంతి): టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్న ప్రజలకు నిర్వహిస్తున్నటువంటి పరీక్షలలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎక్స్ రే పరీక్షల తీరును అలాగే ఇంకా ఎక్కువ మందికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ టీబీ హాస్పిటల్ ను సందర్శించారు.
ఆసుపత్రిలో ప్రతిరోజు ఎన్ని ఎక్స్ రే లు తీస్తున్నారు, ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉందా, ఇప్పటివరకు ఎన్ని ఎక్స్ రే లు తీశారని అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా ప్రస్తుతం 30 నుంచి 40 వరకూ తీస్తున్నామని, ఇప్పటివరకు 220 తీశామని 90 నుండి 100 వరకు తీసే అవకాశం ఉందని కానీ ఒక్కరే రేడియోగ్రాఫర్ అందుబాటులో ఉన్నారని టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
పీహెచ్సీలలో ఎక్కడైనా రేడియోగ్రాఫర్ ఉన్నట్లయితే టీబీ ఆసుపత్రికి డిప్యూటీ చేయాలని డిఎంహెచ్‌ఓని ఆదేశించారు. ఆసుపత్రిలోని ఓపి విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న డయాగ్నొస్టిక్ విభాగాన్ని సందర్శించి అక్కడ ఉన్న ఎక్స్ రే మిషను, అలాగే రోజువారి సామర్థ్యాన్ని, అందుబాటులో ఉన్న టెక్నీషియన్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం టీబీ చికిత్స పొందుతున్నటువంటి వ్యాధిగ్రస్తులందరికీ ముందుగా ఒక నెల పోషకాహార కిట్ అందించాలని, మిగతా చికిత్స కాలంలో కూడా వారికి పోషకాహార కిట్ అందించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఏ. అప్పయ్య, టీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, టీహబ్ మేనేజర్ కౌముది, తదితరులు పాల్గొన్నారు.