15-11-2025 07:19:17 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి మండలం: వరి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు ఉంటే, క్లీనర్ల ద్వారా తొలగించిన తర్వాతే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు రైతుల ధాన్యం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తెచ్చినట్లుగా రిజిస్టర్లలో నమోదు చేయాలని, తేమ శాతాన్ని కూడా ప్రతిరోజు చెక్ చేసి రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు ఉంటే, క్లీనర్ల ద్వారా తొలగించిన తర్వాతే కొనుగోలు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లుకు తరలించాలని సూచించారు. రైస్ మిల్లు కు తరలించిన అనంతరం అక్కడ వేగంగా అన్లోడ్ చేసి ట్రక్ షీట్లు తెప్పించుకొని రైతులకు వేగంగా నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల అధికారికి సూచించారు.
అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. పాక్స్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కూడా అక్కడికే వచ్చి ధాన్యం కొనుగోలు నిర్వహిస్తుండడంతో ఇబ్బందికరంగా ఉందని ఐకెపి నిర్వాహకులు సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల అధికారికి కలెక్టర్ సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, తహ సిల్దార్ రమేష్ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.