15-11-2025 07:59:55 PM
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్
బెల్లంపల్లి అర్బన్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతి జరుగుతున్నదని, మూడు లక్షలిస్తే ఇండ్లు ఇస్తామని బేరాలు చేస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రాజీనామా చేయాలనీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్య య్యల ఏమాజి డిమాండ్ చేశారు. శనివారం బెల్లంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... ఇండ్లు లేని నిరుపేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ లను ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఆయన అనుచరులు అమ్ముకోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ నాయకులే స్వయంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆడియోలు బయటకు వచ్చాయన్నారు.
ఇంత నిర్లజ్జగా ఎమ్మెల్యే వినోద్, కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం అంత సిగ్గుమాలినపని మరొకటి లేదన్నారు. ఎమ్మెల్యే వినోద్ కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. పార్టీ పదవులను సైతం అమ్ముకుంటున్నారని,ఇందులో ఉన్నత స్థాయి నాయకులకు సైతం వాటాలు పోతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లలో పక్కా అవినీతి జరుగుతున్నదని స్పష్టం చేశారు. యాభై వేలు ఇస్తేనే ప్రొసీడింగ్స్ ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తున్నారని విమర్శించారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు పేరుతో చిన్న వ్యాపారుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. అవసరం లేకున్నా దుకాణాలను తొలగిస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనన్నారు.ఎమ్మెల్యే వినోద్, ఆయన పీ ఏ లు, కాంగ్రెస్ నాయకులు, కొంత మంది అధికారులు కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యే వినోద్ కు సమస్యలు చెప్తామంటే ఆయన హైద్రాబాద్ లోనే ఉంటూన్నారని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ అవినీతి వ్యవహారంలో జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాలని, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లక్కీ డ్రా పద్ధతిలో కేటాయించాలన్నారు.