calender_icon.png 15 September, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారోజు స్ఫూర్తితో ఉద్యమించా

05-12-2024 12:00:00 AM

“తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎత్తిపట్టిన ఉద్యమ పిడికిలి మారోజు వీరన్న. అగ్రవర్ణ కులాలపై, దోపిడీ  శక్తులకు వ్యతిరేకంగా పోరాడి బహుజన సమాజం కోసం పాటుపడ్డారు. అంబేద్కర్ ఆలోచనలతో దళిత బహుజన కుల సంఘాల ద్వారా గడపగడపకు తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. ఆయన ప్రభావమే నన్ను మలిదశ ఉద్యమం వైపు అడుగులు వేసేలా చేసింది” అన్నారు మలిదశ ఉద్యమకారుడు మారోజు రామాచారి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రస్థానం ఎలా మొదలైంది? తెలంగాణ వనరుల కోసం ఉద్యమించిన తీరును ‘విజయక్రాంతి’తో వివరించారిలా..

వరంగల్ అంటే కళల కణాచి మాత్రమే కాదు.. ఉద్యమాలకు నిలయం కూడా. తొలి, మలిదశ ఉద్యమాలు వరంగల్ కేంద్రంగా జరిగాయి. అవన్నీ నాపై బలమైన ముద్ర వేశాయి. నాది ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరు గ్రామం. చిన్నప్పట్నుంచే కమ్యూనిస్టు భావాలు ఎక్కువ. జనగాంలో పదో తరగతి చదువుతున్న సమయంలో మేధావులు, కమ్యూనిస్టు నేతల పోరాటాలను ప్రత్యక్షంగా చూశా. బహుజనవాది మారోజు వీరన్న నాకు దగ్గరి బంధువు. అన్నలాంటివారు.

ఆయన నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాటాలు చేస్తుండేవారు. చిన్న రాష్ట్రాలతోనే దళిత బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందనే లక్ష్యంతో, అంబేద్కర్ ఆలోచనలతో 1997లోనే వేలాదిమందితో తెలంగాణ మహాసభను తలపెట్టాడు. ఆయన స్ఫూర్తితో మొదటిసారి బహిరంగ సభకు హాజరయ్యా. అప్పుడు నాకు 20 ఏళ్లు కూడా నిండలేదు. తెలంగాణ ఎందుకు సాధించుకోవాలి? ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి ఆయన ఇచ్చినా ఉపన్యాసం నరనరాన జీర్ణించుకుపోయింది. అప్పట్నుంచే నాలో ఉద్యమ కాంక్ష మొదలైంది. అలా ఉద్యమంతో అనుబంధం ఏర్పడటంతో ఎక్కడా ఏ సభలు జరిగినా వెళ్లేవాణ్ని. 

శ్రీకాంతాచారి మరణం కదిలించింది

ఉమ్మడి పాలనలో తెలంగాణ ఎంతో కోల్పోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇలా ఏ రంగంలోనైనా అధిక వాటా ఆంధ్రప్రదేశ్‌కే దక్కేవి. ఇవన్నీ నాలో కసిని పెంచాయి. మన జీవితాలు బాగుపడాలంటే ‘తెలంగాణ రావాలె’ అని గట్టిగా కోరుకున్నా. అప్పుడే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైంది. 2009లో తెలంగాణ ఉద్యమం మరింత తారాస్థాయికి చేరుకుంది. ఉద్యమ ప్రారంభ రోజుల్లో ఉద్యమకారులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.

ఉద్యమకారులు పదుల సంఖ్యలో ఉంటే.. పోలీసుల బలగాలు వందల సంఖ్యల్లో ఉండేవారు.  అయినా సరే పోలీసులను ఎదురించి స్నేహితులతో కలిసి ధర్నాలు చేశాం. కుటుంబసభ్యులను పట్టించుకోకుండా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలితం లేకపోవడంతో కిరోసిన్ డబ్బాలతో రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. రాష్ట్రంలో అలజడి సృష్టితే ప్రభుత్వంలో కదలిక వస్తుందనే ఆలోచనతో నాలాంటివాళ్లు కిరోసిన్ డబ్బాలో నీళ్లు పోసుకొని బెదిరించే ప్రయత్నం చేశారు.

కానీ నేను ఒరిజనల్ కిరోసిన్ డబ్బాతో పోలీసులను భయపెట్టినా సందర్భాలున్నాయి. అయితే ఉద్యమ ప్రభావమో, ఇతర కారణాలో ఏమోకానీ నా కళ్ల ముందే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఆ సమయంలో పోలీసులపై ఉన్న జాకెట్స్ తీసుకొని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశా. అప్పటికే శరీరం మొత్తం కాలిపోయింది. ఆస్పత్రికి తరలించినవారిలో నేను ఒకడ్ని. కళ్ల ఎదుట ఓ యువకుడి బలిదానం చేసుకోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. 

జైలులో ఉద్యమ కార్యాచరణ

ధర్నాలు, రాస్తారోకోలో స్వయంగా పాల్గొనడంతో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ సయమంలో జైలులో ఉద్యమకారుల పరిచయం ఏర్పడింది. తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమాలు చేయాలి? ఏ విధంగా చేయాలి? అనే కార్యాచరణ రూపొందించుకున్నాం. అప్పటివరకు ఆందోళనలు అంటే ధర్నాలు, నిరసనలు మాత్రమే ఉండేవి. రైలోరోకోలు కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. జైలు నుంచి విడుదలైన తర్వాత ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా.

నాలాంటివాళ్లతో కలిసి అనేక రైలోరోకోలు చేశా. తెలంగాణ వస్తదా? రాదా? అనే విషయం పక్కన పెట్టి మరీ ఉద్యమించా. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టడాన్ని ఆంధ్రపాలకులు వ్యతిరేకించినందుకుగాను కరపత్రాలు పంపిణీ చేపట్టాను. తెలంగాణ బిల్లును ఎందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి? అనే విషయమై అనేక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నా. అదే సమయంలో ఉద్యమకారులు, మేధావులు గద్దర్, కోదాండరామ్, కేశవరావ్ జాదవ్ లాంటివాళ్లతో పరిచయం ఏర్పడింది. వాళ్లు పిలుపునిచ్చినా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నా. 

వనరులను కాపాడాం..

ఉద్యమ సమయంలో తెలంగాణ ఎన్నో వనరులు కోల్పోయింది. భవిష్యత్తు తరాలకోసం వనరులు కాపాడాలని కూడా భావించా. అప్పటికే ఉద్యమకారుడిగా అనేక జిల్లాలు తిరిగా. తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో అనేక వనరులున్నాయి. విలువైన భూములున్నాయి. వాటిని కాపాడేందుకు ‘తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ’లో కీలక సభ్యుడిగా పనిచేశా. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే, మరోవైపు వనరుల పరిరక్షణ కోసం పాటుపడ్డాం. ఆనాడు విలువైన భూములను కాపాడాం.

నల్లగొండ జిల్లా కాసారం గ్రామంలో మైనింగ్ ఉండటంతో ప్రైవేట్ కంపెనీలు తవ్వకాలు జరిపే ప్రయత్నం చేశాయి. వారంరోజుల పాటు గ్రామంలో పర్యటించి గ్రామస్తులను అవగాహన కల్పించి మైనింగ్ మాఫియాను పారదోలాం. అలాగే హైదరాబాద్‌లో విచ్చలవిడిగా పబ్లింగ్ హోర్డింగ్స్ ఏర్పాటయ్యేవి. హోర్డింగ్స్ ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం చేకూరేది. అంతేకాదు... ఈదురుగాలులకు, భారీ వర్షాలకు హోర్డింగ్స్ కూలీ ప్రాణ నష్టం జరిగేది. వాటిపై ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసి హోర్డింగ్స్‌కు అడ్డుకట్ట వేసి సక్సెస్ అయ్యాం. 

గుర్తింపు ఎక్కడ?

తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా.. అమరుల ఆశయాలు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఉద్యమకారులను గుర్తించాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అంటే 250 గజాల స్థలం, 25 వేల ఫించన్ ఇవ్వాలి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడి ఉద్యమకారులకు గౌరవించి హామీలు నెరవేర్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను ఆదుకోవాలి. లేదేంటే మళ్లీ ఉద్యమించే పరిస్థితులు వస్తాయి.