08-10-2025 12:23:06 AM
“౨౦౦౭లో ఇదే నెలలో నేను నటించిన తొలిచిత్రం ‘హ్యాపీడేస్’ విడుదలై, నా కెరీర్‌నే మలుపు తిప్పింది. నా జీవితంలో అక్టోబర్ గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇదే నెల లో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి” అని హీరో వరుణ్‌సందేశ్ అన్నారు. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్‌కే దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించారు.
ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవు తున్న సందర్భంగా మూవీటీమ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. “సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో మలిచిన చిత్రం ఇది” అన్నారు. దర్శకుడు ఆర్యన్ మాట్లాడుతూ.. “ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది” అని చెప్పారు.
“ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని ఈ సినిమాలో చూపించాం. అమ్మాయిలు, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది” అని నిర్మాత జగదీశ్ తెలిపారు. ఈ వేడుకలో యువ హీరోలు అర్జున్, కార్తీక్‌రాజు, విశ్వ కార్తికేయ, చిత్రబృందం పాల్గొన్నారు.