06-12-2025 12:01:07 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్ : జిల్లాలో క్రీడాస్ఫూర్తి, యువత ప్రతిభను వెలికి తీసే దిశగా నిర్వహిస్తున్న 51వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కబడ్డీ క్రీడను రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే అసలైన పాఠశాలలు.
చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకున్న యువత ఏ రంగంలోనైనా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు” అని అన్నారు. “తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత క్రీడల అభివృద్ధిని రాష్ట్ర ప్రాధాన్య ప్రణాళికల్లో భాగం చేశాం. గ్రామ పంచాయతీ స్థాయిలోనుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ, స్టేడియంల నిర్మాణం, ఆటలను ప్రోత్సహించే పథకాల అమలు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనతో క్రీడాకారులు శాస్త్రీయ శిక్షణ, జాతీయ స్థాయి కోచ్‌లు, ఆధునిక సదుపాయాలను పొందగలరని చెప్పారు. తెలంగాణ జిల్లాలోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ఆ యూనివర్సిటీతో అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేస్తోందని ఆయన అన్నారు. జిల్లా స్థాయిలో క్రీడల అభివృద్ధి దృష్ట్యా, స్థానిక స్టేడియంలను ఆధునీకరణ, యువతకు తక్కువ ఖర్చుతో శిక్షణ, పాఠశాలలలో క్రీడా ప్రోత్సాహం, ప్రతిభ ఉన్న ఆటగాళ్లను రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడం వంటి చర్యలు వేగవంతం ఎచేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
"క్రీడలో రాణించడానికి క్రమశిక్షణ, పట్టుదల, కఠిన సాధన తప్పనిసరని, మీ ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఇలాంటి వేదికలను వినియోగించుకోవాలని అన్నారు. కబడ్డీ పోటీల విజయవంతమైన నిర్వహణకు జిల్లా కబడ్డీ సంఘం, క్రీడాశాఖ అధికారులు నిర్వాహక బృందానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, రామచంద్రయ్య పడాకుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.