12-01-2026 05:46:49 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఇంటర్మీడియట్ ప్రాక్టిల్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించాలని షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.విద్యార్థులు పరీక్షలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు పరీక్షల సమయానికి నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య మాట్లాడుతూ పరీక్షల వివరాలను వెల్లడించారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి 21వ తేది వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి ప్రాక్టికల్ పరీక్షలకు 5639 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వారిలో ఇంటర్మీడియట్ జనరల్ ద్వితీయ సంవత్సరం 3360 మంది విద్యార్థులు, ఒకేషనల్ మొదటి, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 2279 పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షల అనంతరం ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలై మార్చి 18వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.