07-01-2026 09:21:13 PM
అంతర్జాతీయ పారా వాలీబాల్ క్రీడాకారుడు అమరారపు సైదులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్–1, 2, 3, 4, ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జీవో నెంబర్ 74 ప్రకారం దివ్యాంగ క్రీడాకారులకు (పారా స్పోర్ట్స్) కేటాయించాల్సిన 2% రిజర్వేషన్లు ఇప్పటివరకు అమలులోకి రాకపోవడం తీవ్ర అన్యాయం జరుగుతుందని అంతర్జాతీయ పారా వాలీబాల్ క్రీడాకారుడు అమరారపు సైదులు అన్నారు.
బుధవారం గరిడేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పారా స్పోర్ట్స్ పాలసీ అమలు కాకపోవడం వల్ల అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన అనేక మంది దివ్యాంగ క్రీడాకారులు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థికరంగాల్లోతీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2023లో హైకోర్టు జీవో నెంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటాలో పారా స్పోర్ట్స్‌ను కూడా చేర్చి 2% రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ–2025ని ప్రవేశపెట్టి సుమారు ఏడు నెలలు గడిచినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదని, దీని ప్రభావంగా టీజీపీఎస్సీ (TGPSC)ఆధ్వర్యంలో విడుదలైన గ్రూప్–1 నోటిఫికేషన్ లో దివ్యాంగ క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయారని అమరారపు సైదులు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 74ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని,స్పోర్ట్స్ కోటాలో పారా స్పోర్ట్స్‌కు 2% రిజర్వేషన్లు తక్షణమే కల్పించాలని,ఇప్పటికే నష్టపోయిన దివ్యాంగ క్రీడాకారుల కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.