07-01-2026 09:15:39 PM
- కెవికె మృత్తిక శాస్త్రవేత్త కిరణ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): సేంద్రీయ వ్యవసాయంలో ద్రావణాలు, కషాయాలను వినియోగించడం ద్వారా పంటలకు చీడపీడలను నియంత్రించవచ్చని గడ్డిపల్లి కృషి విజ్ఞాన్ కేంద్రం మృత్తిక శాస్త్రవేత్త కిరణ్ తెలిపారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కేవీకేలో సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమం మూడో రోజున, కృషి విజ్ఞాన కేంద్రం, నార్మ్, రాజేంద్రనగర్ వారి ఆర్థిక సహకారంతో బుధవారం రైతులకు ప్రాయోగిక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి శాస్త్రవేత్త కిరణ్ మాట్లాడుతూ... వివిధ పంటల్లో ఉపయోగించే సేంద్రియ ద్రావణాలు, కషాయాల తయారీ విధానం, వినియోగ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
ద్రావణాలు, కషాయాలు పంటల పెరుగుదలకు,పురుగు,రోగ నియంత్రణలో ముఖ్యమైనవని ఆయన వివరించారు. అనంతరం రిటైర్డ్ శాస్త్రవేత్త బి.లవకుమార్ మాట్లాడుతూ సమగ్ర వ్యవసాయ పద్ధతులు, పశుపోషణ, సహజ వనరుల వినియోగం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించుకోవడంపై సమాచారం అందించారు. డాక్టర్ పి.అక్షిత్ సాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహక పథకాలు, సబ్సిడీలు, అర్హతలు, దరఖాస్తు విధానాలను వివరించారు. శిక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎ.కిరణ్, పి.అక్షిత్ సాయి, వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు.