calender_icon.png 19 November, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్

24-07-2024 01:29:32 AM

  • విద్యా వ్యవస్థలో సమూల మార్పులు 
  • స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం
  • ఐఐటీ బాసరలో మత్తు పదార్థాల కలకలంపై విచారణ 
  • మీడియాతో చిట్ చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): పాఠశాల విద్యావ్యవస్థలో సమూల మార్పు లు తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మంగళవారం ప్రారం భం కాగా, సభ వాయిదా పడిన తర్వాత లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మండలానికి ఒక ఇంటర్నేషన్ పాఠశాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వెల్లడించారు. బిర్లా, ఓక్లిడ్జ్ స్కూల్స్ తరహాలో ఒక్కో పాఠశాలను రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల అంచనాలతో నిర్మించే అంశంపై అధ్యయనం చేస్తున్నామన్నారు.

మండలానికి మూడు చొప్పున సెమీ రెసిడెన్సియల్, ఒక రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు అక్కడ 4వ తరగతి నుంచి 12 తరగతి వరకు చదవుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నర్సరీ నుంచి 3వ తరగతి వరకు ప్లే స్కూల్ తరహాలో బోధన చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా ఆలోచన చేస్తున్నామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, నర్సరీ నుంచి 3వ తరగతి వరకు చేప్పే టీచర్లను వేర్వేరుగా నియమించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ట్రాన్స్‌పోర్టు వాహనాలను అందిస్తామన్నారు.

స్మితా సబర్వాల్‌పై ఏమన్నారంటే.. 

సివిల్ సర్వీస్‌లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతన్నది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందిస్తూ.. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఆమె వ్యక్తిగతమన్నారు. ఆ ట్వీట్‌తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఆనందంలో రైతులు..

రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తిప్పికొట్టారు. రుణమాఫీతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కానీ హైదరాబాద్‌లో ఉండి ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. తమది ప్రజాపాలన అని, ప్రతి విషయంలోనూ ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తామన్నారు. అలాగే ఐఐటీ బాసరలో మత్తు పదార్థాలు లభించడం దురష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.