calender_icon.png 19 November, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ హోటళ్లపై ఐటీ దాడులు

19-11-2025 12:16:54 AM

  1. పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ హోటళ్లలో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు
  2. వందల కోట్ల వ్యాపారం, భారీగా పన్ను ఎగవేత?

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ మెరుపుదాడులు కలకలం రేపాయి. నగరవాసులకు సుపరిచితమైన, వందల కోట్ల వ్యాపారం చేసే ప్రముఖ హోటళ్లపై ఐటీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే పంజా విసిరారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న పక్కా ఆరోపణల నేపథ్యంలో పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ వంటి హోటళ్లపై ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేపట్టారు.

మంగళవారం తెల్లవారుజామున ఐటీ శాఖకు చెందిన పలు బృందాలు ఒకేసారి ఈ మూడు హోటళ్లకు చెందిన కార్యాలయాలు, వాటి చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాలపై దాడులు ప్రారంభించాయి. రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ యజమాని మాజిద్ ఇంట్లో, శాలిబండలోని పిస్తాహౌస్ ప్రధాన కార్యాలయంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. షాగౌస్, మెహిఫిల్ హోటళ్ల యజమానుల ఇళ్లలో, కీలక కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు.

ఈ హోటళ్లు ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని, అయితే అందుకు తగ్గట్టుగా పన్నులు చెల్లించడం లేదని ఐటీ శాఖకు బలమైన ఆరో పణలు అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్లు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర నగరాలతో పాటు దుబాయ్‌లోనూ తమ బ్రాంచీలను విస్తరించాయి. ఈ అంతర్జాతీయ లావాదేవీలలో భారీగా పన్ను ఎగవే తకు పాల్పడ్డారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సోదాల్లో భాగంగా, ఐటీ అధికారులు హోటళ్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు ముగిసిన తర్వాత భారీ మొత్తంలో లెక్కచూపని ఆదాయం బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.