calender_icon.png 18 November, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండునెలల్లో బడ్జెట్ ప్రవేశపెడతాం

24-07-2024 01:02:03 AM

  • ఆర్థిక ఇబ్బందులతోనే జాప్యం 
  • ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో రాష్ర్ట గవర్నర్ అబ్దుల్‌నజీర్ ప్రసంగానికి చంద్రబాబు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగంతోనే ఏపీ ఏర్పాటు చేశారని, ఐదేళ్ల పాటు మూడు రాజధానుల పేరుతో వైసీపీ నెట్టుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రానికి మాజీ సీఎం జగన్ రాజధాని లేకుండా చేశారని, రాష్ర్టం ఏర్పడి పదేళ్లు గడిచినా క్యాపిటల్ లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి అంటే గతంలో మద్రాస్ అనేవారని, తెలుగు జాతి గౌరవాన్ని దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శిఖరాగ్రానికి తీసుకెళ్లారని కొనియాడారు.

ఎన్నికల్లో కూటమిని అద్భుత మెజార్టీతో ప్రజలు గెలిపించారని, ఇది ప్రజా చైతన్యానికి నిదర్శనమన్నారు. 93 శాతం స్ట్రుక్‌రేటుతో   కూటమికి 57 శాతం ఓట్లు పడ్డాయన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఫలితం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047తో ప్రపంచంలోనే తొలి రెండు స్థానా ల్లో ఇండియా నిలుస్తుందని, ఆ దిశగా దేశం అడుగులు వేస్తోందని తెలిపారు. విజన్ 2020 తయారుచేశాక అభివృద్ధి మొదలైందని, మాజీ పీఎం పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలతో దేశంలో పెనుమార్పులు వచ్చాయని గుర్తుచేశారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్‌కల్యాణ్ ముందుకొచ్చారని తెలిపారు. ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ మాతో చేతులు కలిపిందని చంద్రబాబు అన్నారు. ఏపీని మళ్లీ అభివృద్ధి చేసేవరకు కలిసి పనిచేస్తామన్నారు. రాష్ర్ట చరిత్రలో గత ఐదేళ్లు చీకటి రోజులని, ఎక్కడా భూములు, ఆస్తులను వదల్లేదని, మెడపై కత్తిపెట్టి తమ పేరుపై భూములు రాయించుకున్నారని ఆరోపించారు. 

అమరాతిని నాశనం చేశారు: చంద్రబాబు

గత ఐదేళ్లలో రాష్ర్ట ప్రజలు నరకం చూశారని, మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అమరావతిని జగన్  సర్వ నాశనం చేశారని, రాజధాని కలను చంపేశారని ఆరోపించారు. అమరావతి దేవతల రాజధాని.. అలాంటిది నిన్నటి వరకు ఏమైందో మనం చూశాం. కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చి బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించడం శుభపరిణామం అన్నారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో కనిపిస్తోందని, రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే దాదాపు రెండు..మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద వచ్చి ఉండేదని ఈ రోజు అప్పులు చేయాల్సిన అవస్థ తీరేదని తెలిపారు. టీడీపీ హయాంలో ఏపీ జీవనాడి పోలవరం 72 శాతం పూర్తయినా.. వైసీపీ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపిందని దుయ్యబట్టారు. 

హూ కిల్డ్‌కు బాబాయ్‌కి త్వరలో జవాబు..

వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగిందని.. హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ వెళ్లారని.. సీబీఐకి విషయం తెలిపేందుకు సీఐ సిద్ధపడగా.. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చిందని మండిపడ్డారు. విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి. నేరస్థుడే సీఎం అయితే పోలీసులు కూడా వంత పాడే పరిస్థితి ఏర్పడిందన్నారు..వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కి తిరిగి వచ్చారని, హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని తెలిపారు. ఐదేళ్లలో ప్రభుత్వ ఆదాయం దోపిడీ జరిగిందని.. ఇసుక, మద్యం వంటివి రూ.లక్షల కోట్ల మేర దోపిడీ జరిగాయని అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు.