12-10-2025 12:50:30 AM
కామరెడ్డిలో నకిలీ నోట్లు వెలుగులోకి రావడంతో దర్యాప్తు
పోలీసుల అదుపులో 8 మంది, పరారీలో మరి కొంతమంది
కామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల తయారు,చలామణి చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 బృందాలుగా వెళ్లిన పోలీసులు పలు రాష్ట్రాల్లో తీగ లాగి డొంకను కదిలించారు. 12 మంది అంతర్రాష్ట్ర ముఠాలోని ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనట్లు ఎస్పీ రాజేష్‌చంద్ర తెలిపారు.
ముఠాకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. గతనెల 23న మద్యం దుకాణంలో పని చేసే అఖిల్‌కు ఓ వ్యక్తి రెండు ఫేక్ రూ.500 నోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లాడు. తర్వాత అవి నకిలీ నోట్లు గుర్తించిన అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నకిలీ నోట్ల సూత్రధారి ప్రభుత్వ ఉపాధ్యాయుడేనని తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన సిద్దాగౌడ్ అనే వ్యక్తి దొంగనోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించాలని ఫేస్‌బుక్ యాడ్ ద్వారా అందులో ఉన్న నంబరుకు ఫోన్ చేసినట్టుగా వెల్లడించాడు.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన సౌరవ్‌డే అనే వ్యక్తి సిద్దాగౌడ్‌కు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అతనికి కాంటాక్ట్ అయ్యాడని, ఫేక్ కరెన్సీ కావాలని అడిగితే రూ.5వేలకు రూ.10వేల నకిలీ నోట్లు పంపుతామని ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పాడు. 18న కొరియర్ ద్వారా 18 నకిలీ నోట్లు పంపగా అందులో నుంచి రెండు నోట్లు తీసుకెళ్లి మద్యం కొనుగోలు చేసినట్లు తేలింది.
కాగా ఈఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర ముఠా కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీఎస్ బృందం వెస్ట్ బెంగాల్ వెళ్లి సౌరవ్‌డేను గత నెల 27న పట్టుకుని విచారించగా హరి నారాయణ భగత్ అనే వ్యక్తితో కలిసి నకిలీ నోట్లను బీహార్‌కు చెందిన రషీద్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించుకుని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు.
సౌరవ్‌డే, హరి నారాయణ భగత్‌లను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం బీహార్‌కు వెళ్లిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో రషీద్‌ను పట్టుకున్నారు. రషీద్ ఎంఎస్సీ చదువుకున్నాడని, అతనికి కలర్, కెమికల్ మిక్సింగ్‌పై అవగాహన ఉండటంతో నకిలీ నోట్ల తయారీతో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నందులాల్ జంగ్‌డే, చట్టరామ్, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సౌరవ్ డే, హరి నారాయణ భగత్, పండిత్ అలియాస్ శారతక్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కరెన్సీ కాట్ని అలియాస్ లఖన్ కుమార్ దుటే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, మహారాష్ట్రకు చెందిన శివశర్మ అలియాస్ ప్రమోద్ కాట్రేలు ఒక గ్రూపుగా ఏర్పడి నకిలీ కరెన్సీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్న విధంగానే నందులాల్ జంగ్‌డే, చట్టరామ్, రషీద్ కలిసి బిక్రమ్ గంజిలో వివిధ షాపుల్లో కరెన్సీ తయారీకి కావాల్సిన కంప్యూటర్, కలర్స్, ఇంక్ ప్రింటర్స్, కట్టర్స్, ల్యామినేటర్స్, టోనర్స్, కలర్ ప్రింటర్ ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు.అనంతరం అనంతరం 500, 200, 100, 50, 20 రూపాయల నకిలీ నోట్లను 1:2 రేషియో ద్వారా ఆర్డర్ తీసుకుని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన కస్టమర్ల నుంచి వివిధ నంబర్ల స్కానర్లకు డబ్బులు పంపించుకుని కొరియర్ ద్వారా ఫేక్ కరెన్సీని పంపిస్తున్నారు ఇందులో రషీద్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
సోషల్ మీడియా ద్వారా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లకు 1:0.5 రేషియో ప్రకారం డబ్బులు ఇస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రూ.3 కోట్లకు ఆర్డర్ పెట్టారన్నారు. అతడిని అరెస్ట్ చేశామని, అతని తండ్రి పరారీలో ఉన్నట్లు తెలిపారు. తాము చేపట్టిన ఆపరేషన్‌కు ఇతర రాష్ట్రాల పోలీసులు పూర్తిగా తమకు సహకరించారని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని, వాళ్లను తాము కస్టడీకి కోరి విచారణ చేపడతామన్నారు. కలకత్తా ఆపరేషన్‌లో స్వయంగా పాల్గొన్న ఏఎస్పీ చైతన్య రెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.