calender_icon.png 25 November, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంలో మోహినియాట్టం పుస్తక పరిచయం

25-11-2025 05:05:37 PM

ప్రపంచ నలుమూలల నుంచి వర్చువల్ గా పాల్గొన్న 50 మంది అధ్యాపకులు, పరిశోధకులు

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) మంగళవారం ‘మోహినియాట్టం: ఎ రీడర్, 1&2 ప్రతులను’ పరిచయం చేయడానికి వర్చువల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ నలుమూలల ఉన్న ప్రఖ్యాత ప్రొఫెసర్లు, పరిశోధకులు దాదాపు 50 మంది ఇందులో పాల్గొన్నారు. జీఎస్ హెచ్ఎస్ లోని లలిత, ప్రదర్శన కళల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మైథిలి మరాట్, ఐఐటీ భువనేశ్వర్ లోని మానవతావాద అధ్యయన విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కావ్య కృష్ణ ఈ పుస్తకానికి సంపాదకీయం వహించారు. తొలుత, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు, నృత్య పరిశోధన యొక్క పరిధిని సాంకేతికత, సౌందర్యశాస్త్రం దాటి విస్తృతం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

జాతీయవాదం, వలసవాదానంతర, ఇతర సామాజిక-రాజకీయ చట్రాలతో దానిని అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పది మంది ప్రముఖ ప్యానలిస్టులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నృత్య పరిశోధనకు అభివృద్ధి చెందుతున్న విధానాల గురించి, సమకాలీన అజెండాల ద్వారా గతం యొక్క దృక్పథాలు ఎలా రూపొందించబడుతున్నాయో కొలంబియా విశ్వవిద్యాలయంలోని బర్నార్డ్ కళాశాల ప్రొఫెసర్ ఉత్తర ఆశా వివరించారు. మోహినియాట్టంలో తన పరిశోధన ఆధారిత దేశీ కచేరీ నుంచి అంతర్దృష్టులను సీనియర్ గురు నిర్మలా పనిక్కర్ పంచుకున్నారు. మోహినియాట్టం సంగీత సంప్రదాయాల అన్వేషణను కళాకారిణి-పండితురాలు డాక్టర్ దీప్తి ఓంచేరి వివరించారు. తన అమ్మమ్మ వారసత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా నృత్య రూపాన్ని విస్తరించడానికి చేసిన ప్రయత్నాలను మూడవ తరం కళాకారాణి స్మిత రాజన్ విశదీకరించారు.

కేరళ నుంచి కోల్ కతా వరకు మోహినియాట్టం ప్రయాణం, దాని సాంస్కృతిక పెరుగుదల గురించి ఫుల్ బ్రైట్ స్కాలర్ డాక్టర్ ప్రియదర్శిని ఘోష్ చర్చించారు. ఇతర వక్తలలో డాక్టర్ అనిషా రాజేష్ (హ్యూస్టన్), డాక్టర్ శ్వేత మంగళత్ (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, యూకే), డాక్టర్ కె.అమిత్ (కేరళ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్), డాక్టర్ అశ్వతి రాజన్ (రాజగిరి కళాశాల) తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం అంతర్దృష్టితో కూడిన స్ఫూర్తిదాయకమైనదిగా మమతా వి. కుమార్ అభివర్ణించారు. మోహినియాట్టం యొక్క విస్తృతమైన, సమగ్ర అవగాహనను ఈ కార్యక్రమం ప్రదర్శించిందని మాళవిక అజికుమార్ ప్రశంసించారు. సవరించిన సంపుటాలు భారతీయ నృత్య పరిశోధనలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తాయి. ఇది మోహినియాట్టంపై తొలిసారిగా సమగ్ర అవగాహనను కల్పిస్తోంది. ముఖచిత్రాన్ని బాల కళాకారిణి అవంతిక అనూప్ రూపొందించగా, అవి ఒక ప్రత్యేకమైన, వ్యక్తిగత స్పర్శను ఈ ప్రచురణలకు జోడించాయి.