19-05-2025 01:27:18 AM
రష్యా కాన్సుల్ జనరల్‌తో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): “అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, కలిసి పని చేద్దాం” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్‌ను కోరారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్ భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను భట్టి విక్రమార్క వివరించారు.
దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్రంలో ఫార్మా ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమల అభివృద్ధికి అదే విధంగా హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సంస్థల విస్తరణకు సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. టెక్స్‌టైల్, కోల్ ఇండస్ట్రీ బయోటెక్నాలజీ, టీ హబ్, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి గురించి వివరించారు.
రాష్ట్రంలో అద్భుతమైన మానవ వనరులను తీర్చిదిద్దిన ప్రొఫెషనల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో అద్భుతమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం అనువుగా ఉంటుందని వివరించారు.
భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సత్సంబంధాలు కొనసాగించడానికి కావలసిన అన్ని రకాల సహకారాలు, సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు. వాలేరి ఖోడ్జాయేవ్ మాట్లాడుతూ.. తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో అడ్వాన్స్ హైటెక్నాలజీ, పురోగమిస్తున్న పరిశ్రమల అభివృద్ధిని గమనిం చామని చెప్పారు.
అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఫార్మా, బయోటెక్నాలజీ, టీ హబ్, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి చాలా బాగున్నందున రష్యా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.