calender_icon.png 22 September, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌డీపీఎల్‌పై ఉక్కుపాదం..!

22-09-2025 12:58:53 AM

  1. తెలంగాణ వ్యాప్తంగా ఆబ్కారీ శాఖ దాడులు
  2. ఐదు రోజుల్లో రూ.80లక్షలకు పైగా విలువైన మద్యం స్వాధీనం
  3. సారా, నకిలీ మద్యం, నాన్‌డ్యూటీ, ఫ్యూరియస్ లిక్కర్ అమ్మకాల నిరోధానికి చర్యలు 
  4. రాష్ట్రానికి వచ్చే రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలపై నిఘా 
  5. నెలాఖరు వరకు తనిఖీలు ముమ్మరమంటున్న ఉన్నతాధికారులు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డీపీఎల్), కల్తీ మద్యం, నాటుసారా, ఫ్యూరియస్ లిక్కర్ తదితర అనుమతి లేని దందాలపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దాడులు చేస్తూ ఐదు రోజుల్లోనే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న రూ. 80లక్షలకు పైగా విలువ గల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ఐదు రాష్ట్రాల వాహనాలపై నిఘా

గోవా, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డిఫెన్స్ మద్యం, రవాణా, వినియోగంపై ఎక్సైజ్ శాఖ నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది.

అంతేకాకుండా ఎక్కువ ధర కలిగిన మద్యం బాటిళ్ల్లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని నింపి అమ్మకాలు చేపట్ట్టే వారిపై, కల్తీ మద్యం తయారు చేసే కేంద్రాలతో పాటు వరంగల్, మహబూబాబాద్, అదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై మూకుమ్మడి దాడులు చేస్తోంది. 

ఐదు డివిజన్లలో ప్రత్యేక బృందాల ఏర్పాటు

ఢిల్లీ, హరియాణా, గోవా,డిఫెన్స్ క్యాం టిన్ల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కువగా రంగారెడ్డి, హైదారాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ డివిజన్లకు అక్రమంగా దిగుమతి అవుతుందని ఆబ్కారీశాఖ భావిస్తోంది.  ఆ డివిజన్లలో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసింది. వీటీతోపాటు ఖాళీ గోదాములు, రైస్ మిల్లుల్లో అనుమతులు లేకుండా తయారవుతున్న కల్తీ మద్యం, ఫ్యూరి యస్ లిక్కర్ విషయంలో ఎస్టీఎఫ్, టీడీఎఫ్ టీములు తని ఖీలు ముమ్మరం చేశాయి.  

మూడు రాష్ట్రాల నుంచి రూ. 80లక్షలకు పైగా విలువైన..

ఐదు రోజులుగా ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల్లో రూ. 80 లక్షలకు పైగా విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకుంది. తాజాగా ఆదివారం రూ. 14.50 లక్షల విలువ చేసే 360 విదేశీ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ఈ మద్యం గోవా, హరి యాణా, ఉత్తర్‌ప్రదేశ్  రాష్ట్రంలోని లక్నో ప్రాంతాల నుంచి దిగు మతి అ యినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. 

ఈ నెల 17న రూ. 4.50 లక్షల విలువ చేసే 88  మ ద్యం బాటిళ్లను పట్టుకుని ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. 18న  19.65 లక్షల విలువ చేసే గోవా, హరియాణాకు చెందిన 405 మద్యం బాటిళ్లను , 19న రూ. 15.85 లక్షల విలువ చేసే 301 మద్యం బాటిళ్లు, 20న   21.80 లక్షల విలువ చేసే 585 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పదేళ్లలో 4,516 కేసులు.. 3,238 మంది అరెస్ట్ 

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలపై ఎక్సుజ్ శాఖ ఉక్కుపాదాం మోపుతూ వస్తోంది. 2014 నుంచి 2025 ఆగస్టు నాటికి 4,516 కేసులు నమోదు చేసింది. 3,238 మందిని ఈ కేసుల్లో అరెస్టు చేసింది. 1,22,222 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. 616 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక గత పదేళ్లలో నాటు సారా తయారీ అమ్మకాలు, రవాణా సమయాల్లో దాడులు నిర్వహించి  నమోదు చేసిన కేసులు కూడా భారీగానే ఉన్నాయి.

2014 నుంచి 2025 ఆగస్టు నాటికి నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణాపై 2,75,028 కేసులు నమోదు కాగా, 31,45,169 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. 1,59,974 మందిపై కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా 65,59,847 కిలోల నల్ల బెల్లం స్వాధీనంతో పాటు 18,065 వాహనాలను సీజ్ చేశారు.

2025 ఆగస్టు నాటికి 10,333 కేసులు, 9,694 మందిపై కేసులు నమోదు చేసి 48,180 లీటర్ల నాటుసారా  స్వాధీనం చేసుకున్నారు. ఇక 2,06,848 కిలోల నల్ల బెల్లం, 1633 వాహనాలను ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. 

నెలాఖరు వరకు దాడులు 

నకిలీ మద్యం, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా అమ్మకాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర, జిల్లా టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో పాటు ఎక్సుజ్ స్టేషన్ల సిబ్బంది కలిసి ఎన్డీపీఎల్, నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే రైళ్లు, వాహనాలు, బస్సులపై నిఘా పెట్టాం. నెలాఖరు వరకు దాడులు కొనసాగుతాయి. 

 ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసిం