25-07-2024 12:00:00 AM
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పెళ్లి చేసుకోకుండా.. ఆమరణ నిరాహార దీక్ష.. రైలు రోకోలు.. జాతీయ రహదారి నిర్బంధాలు.. పోలీసు కేసులు అనుభవించారు జహీరాబాద్‌కు చెందిన ఉద్యమకారుడు రాములునేత. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేశారు. 2002లో తెలంగాణ ఉద్యమంలో మెదక్ ఎంపీ ఆలే నరేంద్రతో పోరాటంలో పాలుపంచుకున్నారు. అలాగే కేసీఆర్ అమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని సహించుకోలేక అదేరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రాములునేత ఆమరణ దీక్ష చేశారు. ఉద్యమ సమయంలో అన్యాయంగా అనేక కేసులు నమోదు చేశారు.
అయినా ఉద్యమాన్ని ఏ మాత్రం ఆపలేదు. అలా ఎన్నో పోరాటాలు.. కేసుల మధ్య.. ప్రత్యేక రాష్ట్రం రావడంతో జహీరాబాద్ నుంచి భద్రచలం వరకు పాదయాత్ర చేసి రాములోరికి మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నో పోరాటలు చేసి సాధించిన తెలంగాణలో పది సంవత్సరాలు కష్టాలు తప్ప పదవులు లేవు. ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారు. పోరాటాలు చేసి సాధించిన తెలంగాణ పది సంవత్సరాల పాటు దోపిడీకి గురి అయిందని రాములునేత తన ఉద్యమానుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు రాములునేత. తెలంగాణ వస్తే బతుకులు మారతాయి అని ఎదురు చూశాం. కానీ పదేళ్ల కాలంలో ఒరిగింది ఏం లేదు. నిజాం రాజు పాలించిన ప్రాంతం.. కర్ణాటక, మహారాష్ట్రాలకు సరిహద్దు పట్టణం.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అంతట ఉద్యమలు జరుగుతున్న ఇక్కడ ఉద్యమం ప్రారంభం కాలేదు. రాష్ట్ర సాధన కోసం జహీరాబాద్‌లో పది మంది కలసి ప్రత్యేక ఉద్యమం చేసేందుకు ముందుకు వచ్చారు. మెదక్ ఎంపీగా ఉన్న ఆలే నరేంద్ర సారధ్యంలో సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రాములునేత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో ఉద్యమం జోరుగా సాగుతున్నా జహీరాబాద్‌లో ఉద్యమ ఊసే లేదు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజలను భాగస్వామం చేసేందుకు గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యం చేశారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం తీవ్రతరం కావడం.. మరో వైపు అమరవీరుల ప్రాణత్యాగాలు కొనసాగుతున్నాయి. అన్నీ వర్గాల సహకారంతో ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియమకాలు వస్తాయి అనుకున్నాం. స్వరాష్ట్రంలో గౌరవంగా బతుకొచ్చు అనుకున్నాం. ఉద్యమలు చేసి సాధించుకున్న తెలంగాణలో దోపిడి పెరిగిపోయింది. ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా చేశారు. అమరుల త్యాగాలతో సాధించిన తెలంగాణలో ఆంధ్ర పాలకులకు, మన పాలకులకు ఎలాంటి తేడా లేకుండా పోయింది. అభివృద్ది చేయడం కాదు.. తన అనుచురులకు పదవులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేందుకు ప్రోత్సహించారు. పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్) ప్రభుత్వం ఏనాడు అలోచన చేయలేదు. కొట్లాడి తేచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ ద్రోహులకు పదవులు అప్పగించారు. ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో ద్రోహులుగా మిగిలిపోయారు.
అమరుల స్ఫూర్తితో ఉద్యమం..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో అమరులైన వారిని స్ఫూర్తిగా తీసుకుని జహీరాబాద్‌లో రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేశాను. మలిదశ ఉద్యమంలో అమరుల త్యాగాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. ప్రత్యేక రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావడంతో మలిదశ ఉద్యమకారులు, ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజల ఆశలను నీరుగార్చారు.
ప్రత్యేక రాష్ట్రా సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను పట్టించుకోలేదు. ఉద్యమకారులను పట్టించుకోకుండా తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చారు. పోరాటం చేసి సాధించుకున్న సొంత రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారు. ఉద్యోగ సంఘాలను, ప్రజా సంఘాలను నిర్వీర్యం చేశారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో రాచరిక పాలన అమలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెట్టించారు. సాధించుకున్న తెలంగాణలో పదవులు రాలేదు.. కాని వేధింపులు తప్పలేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో టీఆర్‌ఎస్ సర్కార్ తెలంగాణ ద్రోహులకు ప్రాధాన్యత కలిపించారు. అదే విధంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన జర్నలిస్టులకు కూడా మోసం చేశారు.
స్థానికులకు ఉద్యోగాలు రాలేదు..
పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. పరిశ్రమల యజమానులకు తొత్తులుగా మరిపోయారు. జహీరాబాద్‌లో ఉన్న మహీంద్రా ఆండ్ మహీంద్రా పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. సిద్దిపేట నిరుద్యో గులకు జహీరాబాద్ మహీంద్రా ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నో బాధలు పడ్డాం. ఇంట్లో పెద్దలు ఎంత చెప్పిన వినకుండా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశాం. ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయి అనుకున్నాం. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నాం. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. ఉద్యమ పార్టీ అనుకున్న టీఆర్‌ఎస్ పార్టీ.. ప్రత్యేక రాష్ట్రం రాగానే పక్కా రాజకీయ పార్టీగా కేసీఆర్ ప్రకటన చేశారు. రాజకీయ పార్టీలో ఉద్యమకారులను ఎప్పుడు పట్టించుకోలేదు.
గౌని దౌలయ్య,
సంగారెడ్డి, విజయక్రాంతి
మంజీరా నది పక్కనే ఉన్నా..
మంజీరా నది జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల నుంచి ప్రవహిస్తున్న చుక్క నీరు వ్యవసాయానికి ఇవ్వలేదు. పది సంవత్సరాలు జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న లక్ష ఎకరాలకు మంజీరా నీరు సరఫరా చేస్తామని ప్రకటించారు తప్ప అమలు చేయలేదు. పది సంవత్సరాలైనా ప్రాంతం వారే సొంత ప్రజలను మోసం చేశారు. తెలంగాణ వచ్చాక సాగునీటి కోసం కృషి చేయలేదు. బీడు భూములకు సాగునీరు అందించి బంగారు పంటలు పండించేందుకు కృషి చేస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ రైతులను మోసం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఆశలు..
కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన కూడా ప్రజలు గుర్తించలేదు. ఎంతో మంది విద్యార్థులు అత్మ త్యాగాలు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత కూడా పార్టీ ప్రజల్లో సానుభూతిని పొందలేకపోయింది. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయాల్సిన సమయంలో చేయలేదు. రాష్ర్ట సాధన కోసం పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు మద్దతు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి రాచరిక పాలన కొనసాగించింది. తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా పది సంవత్సరాలు తమ కుటుంబ ప్రయోజనాల కోసం పని చేసిం ది.
పది సంవత్సరాలు తెలంగాణ ద్రోహులకు పదవులు, కాంట్రాక్ట్ పనులు అప్పగించింది. తెలంగాణ అమరుల ఆకాంక్షను కాంగ్రెస్ సర్కార్ నేరవేర్చాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత కలిపించాలి. రాష్ట్ర ప్రజలు ఆకలిని భరిస్తారు కానీ అణిచివేతను భరించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమకారులను పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్‌కు ఉద్యమకారులు బలం అని మరిచిపోయారు.
తెలంగాణ కోసం త్యాగాలు చేసింది ఎవరు? భోగాలు చేసింది ఎవరు? అని ప్రజలు అలోచన చేసి ఎన్నికలో ఓటుతో బుద్దిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను పక్కనపెట్టి బీఆర్‌ఎస్ పార్టీ నియంతృత్వ పాలన సాగింది. రాష్ట్ర ప్రజలు చైతన్యమై శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించారు. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ది సాధిస్తుందని ఆశతో పోరాటం చేశాం. మా ప్రాంతానికి సాగునీరు వస్తే వ్యవసాయం బాగుపడుతుందని అనుకున్నాం. ప్రత్యేక రాష్ట్రంలో దోపిడి తప్ప అభివృద్ది జరగలేదు.