25-07-2024 12:00:00 AM
నాగర్‌కర్నూల్.. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక భాగం. స్వరాష్ట్రం తర్వాత నాగర్‌కర్నూల్ ప్రత్యేక జిల్లాగా ఏర్పడ్డది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఈ జిల్లాది ప్రత్యేక స్థానం. స్వరాష్ట కల సాకారం కోసం ఎందరో మహానుభావులు అమరులయ్యారు. పరాయిపాలనను సహించని పురిటిగడ్డపై ప్రత్యేక రాష్ట్ర సాధనకై మలిదశ ఉద్యమం మళ్లీ పుట్టింది. నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులతో పాటు అన్ని వర్గాలు ఉద్యమంతో ఏకమయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఉపాధ్యక్షుడు రహీమ్ గురించి ప్రత్యేక కథనం..
మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిప డేలా తెలంగాణ ఉద్యమకారుడు రహీమ్ ఎంతగానో కృషి చేశారు. తాను పుట్టిన గడ్డ కోడేరులో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించేందుకు దాతల సహకారం, స్వంత ఖర్చులతో తొలిదశ ఉద్యమంలో అమరులైన వీరులను స్మరిస్తూ 2010 జనవరిలో తెలంగాణ స్థూపాన్ని ప్రతిష్టించారు. ఇది తెలంగాణలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన రహీమ్ తోటి విద్యార్థులతో పాటు తాను అనుభవిస్తున్న ఇబ్బందులను గ్రహించి.
ప్రత్యేక రాష్ట్రంతోనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని ఉద్యమ కాగడను ఎత్తుకున్నారు. జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం సారథ్యంలో పిడమర్తి రవి, బాల్కసుమన్, రాజారాం యాదవ్‌లతో కలిసి ఉద్యమ బాట పట్టి సకల జనులను ఏకం చేసేందుకు పాదయాత్ర, సైకిల్‌యాత్ర, పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్రలు కూడా చేపట్టారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో చలించిపోయి బతికుండి పోరాడి సాదించుకోవాలని నినదిస్తూ శ్రీకాంతాచారికి గుర్తుగా స్వంత గ్రామంలో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదే సమయం లో కొల్లాపూర్ ప్రధాన కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు కూడా కృషి చేశారు.
కేసీఆర్ బంధువులే బాగుపడ్డారు
స్వరాష్ట్రం కోసం పేగులు తెగేలా సకల జనులంతా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లుగా కేవలం కేసీఆర్ వారి బంధువులు మాత్రమే బాగుపడ్డారు. ఉద్యమంలో పాల్గొన్నవారు, జైలు జీవితాన్ని అనుభవించిన వారు తెరమరుగయ్యారు. ఆంధ్రా పాలకుల కంటే ఎక్కువగా నిర్భందం, నిరంకుశం కేసీఆర్ పాలనలో కళ్లారా చుశాం. ఇప్పుడిప్పుడే ప్రజా పాలన సాగుతోందని నమ్ముతున్నాం.
జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
విద్యార్థి దశలోనే..
ఉద్యమాలకు ఊపిరినూదిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రహీమ్ స్వరాష్ట్రం సిద్ధిస్తేనే భావితరాలకు ఉద్యోగాలు వస్తాయని విద్యార్థి దశలోనే ఉద్యమ కాగడను ఎత్తుకున్నారు. 2007వ సంవత్సంలో పీజీ పూర్తి చేసి 2009 మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. తన స్వంత గ్రామంలోనే అమరవీరుల స్థూపాన్ని నిర్మించి జేఏసీ ముఖ్యనేతల చేతులమీదుగా ప్రారంభించారు. ఫ్రొఫెసర్ ఖాసీం, ఉద్యోగ సంఘం నాయకులు విఠల్, కవి రచయిత దేశపతి శ్రీనివాస్, దరువు ఎల్లన్నలను రప్పించి ఉద్యమస్ఫూర్తిని నింపారు. గ్రామస్థాయి నుంచి డిల్లీ వరకు ఉద్యమాలు చేస్తూ స్వరాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించారు.
బొడ్డుపల్లి మల్లయ్య,
నాగర్‌కర్నూల్, విజయక్రాంతి