29-06-2024 12:27:54 AM
టీ20 ప్రపంచకప్‌లో అజేయ యాత్ర సాగిస్తున్న రోహిత్ సేన నేడు ఫైనల్ ఫైట్‌కు సిద్ధమైంది. మెగాటోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ ముందుకు సాగుతున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో తుది పోరుకు సమయాత్తమైంది. పొట్టి ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. రెండోసారి కప్పును ముద్దాడాలని కలలు కంటుంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఫైనల్ చేరిన సఫారీలు చోకర్స్ ముద్ర చెరిపేసుకోవాలని కాచుకు కూర్చున్నారు.
అప్పుడెప్పుడో 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా.. 17 ఏళ్ల తర్వాత తిరిగి చాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంటే.. ఐసీసీ వరల్డ్‌కప్‌ల్లో ఇప్పటి వరకు విజయం సాధించని ప్రొటీస్ గ్యాంగ్ తొలి సారి ఆశ తీర్చుకోవాలని ఉబలాటపడుతోంది. 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన తర్వాత ఇప్పటి వరకు మరోసారి వరల్డ్ చాంపియన్ అనిపించుకోలేకపోయిన టీమిండియా.. 13 ఏళ్ల తండ్లాట తీర్చాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ రోహిత్ గ్యాంగ్.. కరీబియన్ దీవుల్లో కుమ్మేయండి!
బ్రిడ్జ్‌టౌన్: ఏడాది వ్యవధిలో టీమిండియా రెండో ఐసీసీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరి తుదిమెట్టుపై కంగారూల చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచిన రోహిత్ సేన.. శనివారం టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్.. సూపర్ సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఇక వర్షం అంతరాయం మధ్య ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 68 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఫైనల్లో సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగాటోర్నీలో బౌలర్లు విజృంభిస్తుండగా.. భారత జట్టుకు పెద్ద ఇబ్బందులు కనిపించడం లేదు.
ఒక్క విరాట్ కోహ్లీ ఫామ్ తప్ప జట్టంతా మంచి సమన్వయంతో ముందుకు సాగుతోంది. పెద్ద మ్యాచ్‌ల్లో కోహ్లీ తప్పక రాణిస్తాడని కెప్టెన్ అండగా నిలిచిన తరుణంలో.. ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లీ విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై విజయం అనంతరం డగౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ ఆనందభాష్పాలు రాల్చగా.. విరాట్ అతడిని ఓదార్చుతూ కనిపించాడు.
మరోవైపు నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తయ్యే సహజ లక్షణంతో పాటు.. ఐసీసీ టోర్నీల్లో దురదృష్టాన్ని నెత్తిమీద పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికా జట్టు.. ఈ ఫార్మాట్‌లో ఫైనల్ చేరిన తొలిసారే విజేతగా నిలవాలని భావిస్తోంది. మెగాటోర్నీలో అపజయం ఎరగకుండా సాగుతున్న సఫారీ జట్టు.. తుదిపోరులోనూ దాన్ని కొనసాగించాలని చూస్తోంది. అజేయంగా ఫైనల్ చేరిన ఇరు జట్ల మధ్య రసవత్తర సమరం ఖాయమే. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుండగా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫైనల్‌కు రిజర్వ్ డే ఉండటం సానుకూలాంశం.
ఫైనల్ చేరాయిలా
కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి
బ్రిడ్జ్‌టౌన్: గత ఏడాది కాలంలో భారత జట్టు రెండు ప్రపంచకప్‌ల ఫైనల్‌కు చేరిందంటేనే.. టీమిండియా ఎంత నిలకడగా రాణిస్తుం దో అర్థం చేసుకోవచ్చని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌తో రాహుల్ ద్రవిడ్ కోచింగ్ పదవీ కాలం ముగియనుండగా.. ఫైనల్‌కు ముందు ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నిలకడగా మంచి ప్రదర్శన చేయడం ఆనందకరం. ఏడాది కాలంలో మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీల ఫైనల్‌కు చేరడం చిన్న విషయం కాదు. కృషికి కాస్తంత అదృష్టం కూడా తోడైతే ఈ సారి విశ్వ విజేతగా నిలవడం పెద్ద కష్టం కాదు. ఫైనల్ కోసం జట్టు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంది. సమతూ కంతో ఉన్న రెండు జట్ల మధ్య ఫైనల్ సమరం జరగనుంది. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌తో ద్రవిడ్ కోచింగ్ పదవీ కాలం ముగియనుండగా.. జూలై ఒకటి నుంచి కొత్త కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. దీని కోసం బీసీసీఐ ఇప్పటికే ఇంట ర్వ్యూలు కూడా నిర్వహించింది.