calender_icon.png 2 November, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లకు టెట్ పరీక్ష తప్పదా!?

02-11-2025 12:55:46 AM

నవంబర్ 19న విచారణకు రానున్న టీచర్లు వర్సెస్ త్రిపుర గవర్నమెంట్ కేసు

ఆ కేసుతోనే ముడిపడి ఉన్న 22 పిటిషన్లు

సుప్రీం కోర్టు పిటిషన్లను స్వీకరిస్తుందా? తిరస్కరిస్తుందా? తేలేదీ ఆనాడే

డోలాయమానంలో రాష్ట్రంలోని 42వేల మంది టీచర్ల భవితవ్యం

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పేరు ఎత్తితేనే టీచర్లు హడలెత్తి పోతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం టెట్ రాయాల్సిందేనా? రాస్తే అర్హత సాధిస్తామా? ఒక వేళ సాధించకుంటే ఉద్యోగం పోయినట్టేనా? అనే అనుమానాలను దేశవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఇన్ సర్వీస్ టీచర్లు వ్యక్తం చేస్తున్నారు. గత సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

తమ ఉద్యోగాలు ఉంటయా? ఊడుతయా? అన్న సందేహాలు, భయాలు వారిని వెంటాడుతున్నా యి. రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉపా ధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా సుప్రీం కోర్టులో జోక్యం చేసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభు త్వాలపై ఉపాధ్యాయులు, సం ఘాల నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే టీచర్లకు టెట్ అర్హత కచ్చితంగా ఉండాలా? లేదా? పరీక్ష రాయాలా? వద్దా? అనేది తేలేది మాత్రం నవంబర్ 19 నాడే అని తెలిసింది.

22 పిటిషన్లపై స్పష్టత వచ్చేదప్పుడే.. 

తమిళనాడుకు సంబంధించిన కేసులో సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులో విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులు టెట్ (టీచర్ ఎలిజి బిలిటీ టెస్ట్) ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అని పేర్కొంది. అలాగే ఉపాధ్యాయులు పదోన్నతులు పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టం చేసింది. ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కొనసాగాలంటే మాత్రం టెట్ తప్పనిసరిగా రెండేళ్లలో పాస్ కావాల్సి ఉం టుందని తెలిపింది.

అదేవిధంగా, ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యా యులు మా త్రం టెట్ అర్హత లేకుండానే సర్వీసులో కొనసాగొచ్చని పేర్కొంది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం పడనుంది. తెలంగాణలో 40 వేల నుంచి 42 వేల మంది టెట్ పాస్ కావాల్సిన వారు ఉంటారు. వీరందరూ టెట్‌లో అర్హత సాధించాల్సిందే. లేకుంటే ఉద్యోగాలు పోయే అవకాశముంది.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్ష చేయాలని కోరుతూ టీచర్ సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 22 రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టులో దాఖలు చేసినట్లు తెలిసింది. అందులో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్‌తోపాటు ఎస్‌టీ ఎఫ్‌ఐ జనరల్ సెక్రటరీ-తెలంగాణ, టీఆర్‌టీఎఫ్-తెలంగాణ, ఏఐపీటీఎఫ్ (ఢిల్లీ)- ఏపీపీటీఏ, ఏఐపీటీఎఫ్, యూపీ-ప్ర త్మీక్, యోగరాజ్ సింగ్, ఎన్‌టీయూ-కేరళ, మేఘరాజ్ సింగ్, బేల సాహ, రాధేరామన్, కేరళ-ఎస్టీయూ, ప్రమోద్ కుమార్, మేఘాలయ ఎస్‌ఎస్‌ఏతోపాటు మరికొన్ని పిటి షన్లు దాఖలైనట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవైపు టీచర్ల కోసం టెట్ నోటిఫికేషన్ వేస్తూనే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇదే వరుసలో మరికొన్ని రాష్ట్రాలు, టీచర్ సంఘాలు, టీచర్లు పిటిషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈనెల 19న కోర్టులో టీచర్లు వర్సెస్ త్రిపుర ప్రభుత్వం కేసు విచారణ ఉంది. ఈ కేసు విచారణ సమయంలోనే ఈ అన్ని పిటిషన్లను కోర్టు ఒకవేళ స్వీకరించి విచారణ చేపడితే టీచర్లకు కాస్త ఉపశమనం కలగనుంది. ఒకవేళ ఆ పిటిషన్లను స్వీకరించ కుండా గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమలవుతాయంటే మాత్రం టీచర్లకు టెట్ ‘పరీక్షా’ తప్పదని టీచర్ సంఘాల నేతలు చెబుతున్నారు. 

సిలబస్, అర్హత మార్కులు తగ్గించాలని..

ఒకవేళ టెట్ తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడున్న సిలబస్‌ను మార్చాలని, అర్హత మార్కులను తగ్గించాలని పలు టీచర్ సంఘాల నేతలు కోరుతున్నారు. డీఎ స్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన తమకు మళ్లీ టెట్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టెట్‌కు డీఎస్సీలో 20 మార్కుల వెయిటేజీ ఉంది. తాము ఇప్పటికే డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందినప్పుడు టెట్ ఎందుకు, ఒకవేళ పెట్టాలనుకున్నా అర్హత మార్కులను తక్కువ చేయాలని కోరుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్‌లో 150 మార్కుల్లో 90 మార్కులు ఓసీ, 75 మార్కులు బీసీ, 60 మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సాధించాల్సి ఉంటుంది. కేంద్రం నిర్వహించే సీటెట్‌లో  ఓసీలకు 60 శాతం మార్కులు, ఓబీసీలకు 55 శాతం, ఎస్సీఎస్టీలకు 50 శాతం రావాల్సి ఉం టుంది. అయితే వీటిని తగ్గించాలని టీచర్ సంఘాల నేతలు కోరుతున్నారు. లేదంటే టీచర్లకు స్పెషల్ టెట్‌ను వేయాలని డిమాండ్ చేస్తున్నారు.