02-11-2025 12:22:19 AM
ఆడబిడ్డను ఓడించేందుకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నరు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతకు మద్దతుగా రోడ్ షో
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 500 రోజుల పాలనే మిగిలి ఉన్నదని, ఆ తర్వాత కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటేయకుంటే పథకాలు బంద్ చేస్తా అని సీఎం రేవంత్‌రెడ్డి అనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆడబిడ్డను ఓడించేందుకు కాలికి బలపం కట్టుకుని సీఎం తిరుగుతున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తానంటూ సీఎం ప్రజలను బెదిరించడం సిగ్గుచేటని, ఎగిరెగిరి పడితే ప్రజలు పెట్టే వాతలకు ఆయన ప్రభుత్వమే కూలిపోయే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
ఇది చైతన్యవంతమైన తెలంగాణ గడ్డ అని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను ఎంతోమందిని చూశామని ఘాటుగా వ్యాఖ్యానించారు. మాగంటి గోపీనాథ్ గోపన్నకు జూబ్లీహిల్స్ ప్రజలంటే ప్రాణమని చెప్పారు. కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టించి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని గుర్తు చేశారు. గోపన్నపై మీకున్న అభిమానాన్ని మరోసారి చాటిచెప్పి, ఈసారి రహెమత్‌నగర్ నుంచే 12 వేల మెజార్టీతో సునీతమ్మను గెలిపించాలి అని ప్రజలను కోరారు.
భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆడబిడ్డ మాగంటి సునీత కన్నీరు పెడుతుంటే, ఆమెపై ఆరోపణలు చేస్తారా అంటూ నిలదీశారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నాడని మండిపడ్డారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలను పచ్చి మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.
పథకాలు రద్దు చేస్తానని రేవంత్‌రెడ్డి బెదిరిస్తున్నాడని, అసలు ప్రారంభించిన పథకం ఏదైనా ఉందా చెప్పాలని రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. ఇంకా కాంగ్రెస్‌కు 500 రోజుల సమయం మాత్రమే ఉందని, 500 రోజుల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ హిల్స్‌లో బ్రహ్మాండమైన స్టేడియం నిర్మించి, దానికి మాగంటి గోపీనాథ్ స్టేడియం అని పేరు పెడతాం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.