02-11-2025 01:11:24 AM
9 మంది మృతి
* సాధారణంగా శనివారం రోజు సుమారు 2 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో 25వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ సంఖ్యను అంచనా వేయలేకపోయాం.
ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా
* కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం తెల్ల వారుజామున ఆ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. పైఅంతస్తులో ఉన్న దేవుడిని దర్శించుకుని తిరిగి వచ్చేవారు, తోసుకుంటూ పైకి వేళ్లేవారితో మెట్లమార్గంలో రెయిలింగ్ కూలిపో యింది. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు. 13 మందికి పైగా భక్తులు క్షతగాత్రులయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గలో ఈ దుర్ఘటన జరిగింది. ఉక్కపోతతో ఊపిరి ఆడక అవస్థలు పడి చాలా మంది భక్తులు స్పృహ కోల్పోయారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాట విషాదంపై ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పదేళ్ల క్రితం కాశీ బుగ్గలోని తన 100 ఎకరాల స్థలంలోని 12 ఎకరాల్లో సొంత నిధులతో హరిముకుంద్ పాండా ఈ ఆలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఇది పూర్తిగా ప్రైవేటు గుడి.. ఏపీ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయశాఖ పరిధిలోలేదు. కాగా, కార్తీక మాసం ఏకాదశి పండుగ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, నిర్వాహకులు ముందుగా ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అమరావతి/ శ్రీకాకుళం, నవంబర్ 1: ఆం ధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మం డలం కాశీబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భం గా పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం తెల్లవారుజామున వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్ల స్టీల్ రెయిలింగ్ కూలి తోపులాట జరిగి, అది కాస్త తొక్కిసలాటకు దారి తీసింది. ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతిచెందారు.
మృతుల్లో ఒక బాలుడు ఉన్నాడు. మరో 13 మందికి పైగా భక్తులు క్షతగాత్రులయ్యారు. దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఉద యం 11:30 గంటల ప్రాంతంలో జరిగిం ది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు లు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు.
క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థి తి విషమంగా ఉందని వెద్యులు తెలిపారు. ఆలయ నిర్వాహకుల నిర్వహణ వైఫల్యం, భద్రతాపరమైన లోపాలే ప్రమాదానికి దారితీశాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు ప్రస్తుతం ఆలయ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు, మంత్రి నారా లోకేష్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఆలయ నిర్వాహకుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. తొక్కిసలాటకు సంబంధించిన సమాచారం అందించేందుకు యంత్రాంగం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రో ల్ రూం ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 08942-240557కు కాల్ చేసిసి అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చని తెలిపింది.
భద్రతాపరమైన లోపాలు
ఈ ఆలయం పూర్తిగా ప్రైవేటు గుడి. ఇది ఏపీ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయశాఖ పరిధిలోలేదు. నాలుగు నెలల నుంచి ఆలయానికి ప్రతి శనివారం 2 వేల మంది భక్తులు రావడం ప్రారంభించారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా 25 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. ఆలయంలోకి ప్రవేశం, నిష్ర్కమణకు ఒకే మార్గం ఉండడమూ ప్రమాద తీవ్రతను పెంచింది. భక్తుల రద్దీ పెరగడంతో రెయిలింగ్‌లు కూలిపోవడంతోనే తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అడుగ డుగునా భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి.
ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోయినా కానీ అధికారులు పట్టించుకోలేదు. కొన్ని వారాలుగా భక్తు ల సంఖ్య పెరుగుతున్నా ఒక్కసారి కూడా ఆల య వర్గాలతో పోలీసులు సమీక్ష చేయలేదు. వీఐపీలు దర్శనానికి వస్తున్నా కానీ భద్రతా లోపాలను నిర్వాహకులు గుర్తించలేదు. దేవాలయం నిర్మాణంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల క్యూ లైన్లు, వేచి వుండే షెడ్‌లో ఫ్యాన్లు, వెంటిలేటర్ ఫ్యాన్లు కనిపించలేదు. ఉక్కపోతతో ఊపిరి ఆడక అవస్థలు పడి ఎంతోమంది భక్తులు స్పృహ కోల్పోయారు.
పలాస ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని, అధికారులు పలాసలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీ పీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఆసుపత్రి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు పోలీసులు నిరాకరించారు. ఆసుపత్రి ప్రాంగణం ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ఆసుపత్రి ఎదుట ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ నేతలతో కలిసి బైఠాయించారు.
తొక్కిసలాట ఊహించలేదు: ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా
తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా విచారం వ్యక్తం చేశారు. అన్ని వేల మంది ఆలయానికి వస్తారని తాము అంచనా వేయలేక పోయామననారు.
రూ.15 లక్షల పరిహారం..
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. రాత్రి కాశీబుగ్గకు చేరుకున్న మంత్రి ఘటనా స్థలితో పాటు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామ ర్శించారు. రాష్ట్రంలో మళ్లీ తొక్కిసలాట ఘట నలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కుంటామని వెల్లడించారు.
తిరుమలలో జరిగిన అవమానంతో..
ఆలయ నిర్వాహకుడు 94 ఏళ్ల హరిముకుంద్ పాండా ఆలయాన్ని నిర్మిచేం దుకు ఒక బలమైన కారణం ఉంది. పాండాకు వేంకటేశ్వరస్వామి అంటే ఎనలేని భక్తి. దశాబ్దాల క్రితం ఆయన ఒకరోజు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లాడు. వ్యయప్రయాసల కోర్చి గంటల కొద్దీ క్యూలైన్లలో నించున్నా స్వామివారి దర్శనం కొన్నిసెకన్లయినా కలుగలేదు. ఈలోపే సిబ్బంది ఆయన్ను ముందుకు తోసేశారు.
ఆ అవమాన భారంతోనే పాండాకు కాశీబుగ్గలో వేంకటేశ్వర ఆల యం నిర్మించాలని సంకల్పించాడు. పదేళ్ల క్రితం కాశీబుగ్గలోని తన 100 ఎకరాల స్థలంలోని 12 ఎకరాల్లో సొంత నిధులతో ఆలయం నిర్మించాడు. అచ్చం తిరుమలలో ఉన్న శ్రీవారి విగ్రమం మాదిరిగానే 12 అడుగులవ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు. నాలుగు నెలల క్రితమే ఆలయం ప్రారంభమైంది
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కాశీబుగ్గ తొక్కిసలాట విషాదంపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
తొక్కిసలాట కలచివేసింది: ఏపీ సీఎం చంద్రబాబు
ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనను తనను కలచివేసిందని తెలిపారు. తొమ్మిది భక్తులు మృతిచెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమగ్ర విచారణ చేపడతాం: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతిచెందడం దురదృష్టకరమన్నారు. వీరిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. క్షతగాత్రులకు వారికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉండటం వల్లే ప్రమాదం సంభవించిందని, తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.