calender_icon.png 2 November, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆమె’కేదీ అధికారం?

02-11-2025 12:30:25 AM

  1. రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా మహిళలు
  2. డీసీసీల్లో మహిళలకు సగం పదవులివ్వాలని డిమాండ్లు
  3. సోనియా, ప్రియాంక ఆదర్శం! 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి) : భారతదేశంలోని అన్ని వర్గాలు జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వర్గాలు రిజర్వేషన్లను సాధించగా, మరికొన్ని వర్గాలు కోటా కోసం కోట్లాడుతూనే ఉన్నా యి. ఆయా వర్గాల జనాభా ప్రకారం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ఆ జనా భాలో కూడా సగ భాగంగా ఉన్న మహిళలు మాత్రం రాజకీయంగా రిజర్వేషన్ ఫలాలను అందుకోవడంలో వెనుబడుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా రాజకీయంగా మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించకపోవడమే అని బలమైన వాదనలు ఉన్నాయి. 

రాజకీయంగా వెలుగులోకి వచ్చేదెలా..

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖలు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన నాయకురాళ్లుగా పేరున్న వ్యక్తులు. క్షేత్రస్థాయి నుంచి ఎదిగి నేడు మంత్రులుగా పరిపాలనలో భాగమయ్యారు.  కాంగ్రెస్ పార్టీలో సీతక్క, కొండా సురేఖ వంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ మంత్రి పదవులే రాకపోవచ్చు.

అవకాశం, స్థాయి, నాయకత్వ పటిమను బట్టి వారికి కూడా బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలంటే పరిపాలనలో భాగస్వా మ్యం ఎంత ముఖ్యమో, పార్టీ పరమైన పదవులు కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో అడప దడపా నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవులు కేటాయించడం ద్వారా మాత్రమే మహిళలకు రాజకీయ ప్రాధాన్యత పెరగదు.

దీనికి తోడు కేవలం డబ్బున్న వారికి మాత్ర మే పరిపాలన పరమైన పదవులు, పార్టీ పదవులైనా దక్కుతున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. అర్హతకు తగిన విధంగా మహిళలకూ అవకాశాలు కల్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను తమ కనుసన్నల్లో నడిపించే సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలు కూడా మహిళలే కదా. అలాంటప్పుడు డీసీసీ పదవుల్లో మాత్రం మహిళలకు 50 శాతం భాగస్వామ్యం కల్పించడంలో అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్న లు వినిపిస్తున్నాయి. 

కేంద్రంపై ఒత్తిడి...  

కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ), ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీలతో సహా వివిధ పార్టీ కమిటీల్లో మహిళలకు 33 శాతం స్థానాలను రిజర్వ్ చేయాలని నిర్దేశించింది. దీంతోపాటు ఈ 33 శాతం కోటాను అధిగమించి, రాజకీయాలు, పరిపాలనతో సహా ప్రతి రంగంలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల భాగస్వామ్యానికి సంబంధించి 33శాతం నిబంధన ఉన్నప్పటికీ ఆచరణలో ఈ నియమాలు పూర్తిగా నెరవేరడం లేదని, మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువగానే ఉందని విమర్శలు ఉన్నాయి.

అయితే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన, దేశవ్యాప్త జనగణన అంశాలతోపాటు మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు అంశాలను రాబోయే ఎన్నికల లక్ష్యంగా నిర్దేశించుకున్నది. 2029 పార్లమెంట్ ఎన్నికల వరకు వీటిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. అయితే అప్పటి వరకు వేచి చూడ టం ఎందుకు మహిళా రిజర్వేషన్ ఇప్పటికిప్పుడు అమలు చేయడంలో కేంద్ర ప్రభు త్వానికి వచ్చిన ఇబ్బందులేమిటని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. 

పార్టీ పదవులపై డిమాండ్

వాస్తవానికి రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ అమలవుతుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)ల నియామకం ఆసక్తికరంగా మారింది. అన్ని వర్గాల రిజర్వేషన్ అమలుకు కృషి చేసే కాంగ్రెస్ ప్రభుత్వం.. పార్టీ పరంగా కేటాయించే పదవుల్లో కూడా మహిళలకు సగ భాగం కేటాయించాలనే డిమాండ్ వస్తోంది.

డీసీసీల్లోనూ మహిళలకు 50 శాతం భాగస్వామ్యం కల్పించాలని పార్టీలో అంతర్గతంగా, మహిళా సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే ముందు ఒక మహిళ ప్రధాన మంత్రిగా ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో డీసీసీల్లో మహిళలకు తగిన ప్రాధాన్యత లభించక పోవ డంపై ఆలోచించాలనే వాదనలు వినిపించాయి.

హామీ సరే.. ఆచరణ ఏదీ?

లోక్‌సభ, రాష్ర్ట అసెంబ్లీలలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని ఏఐసీసీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా రిజ ర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కానీ, అది ఆచరణలో మాత్రం ముందుకు సాగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ముందు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉన్నా మహిళలకు ఎందుకు పదవులు కేటాయించడం లేదనే ప్రశ్నలు ఎదరవుతున్నాయి. అటు పరిపాలన పరంగా, ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణాల్లో కూడా మహిళల స్థానా న్ని బలోపేతం చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ డీసీసీ పదవుల్లో మహిళలకు కల్పించే భాగస్వామ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.