18-09-2025 12:00:00 AM
-చైర్మన్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లు
-ఆలస్యానికి ఆడిటింగ్ సరిగా చేయకపోవడమే కారణమా?
మంచిర్యాల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): జిల్లాలోని 11 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లను అవినీతి, అక్రమాలు, రుణాల మంజూరు, రికవరీలలో వ్యత్యాసం, ఎరువుల సొమ్ము సొంతానికి వాడుకోవడం, ధాన్యం కొనుగోళ్లలో గన్నీ సంచుల గోల్ మాల్ తదితర ఆడి ట్ డిఫెకట్స్ పేరిట పక్కన పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో 20 పీఏసీఎస్ చైర్మన్లకుగాను 11 మంది చైర్మన్ లను తొలగించి వా రి స్థానంలో జిల్లా సహకార అధికారి స్పెషల్ ఆఫీసర్లను నియమించి బాధ్యతలు అప్పగించారు. మిగితా తొమ్మిది పీఏసీఎస్ ల చైర్మన్ లు మరో ఆరు నెలల పాటు యథావిధిగా కొనసాగనున్నారు.
11 మంది చైర్మన్ల తొలగింపు
అవినీతి, అక్రమాల పేరిట 11 మంది చైర్మన్‌లను తొలగించిన అధికారులు వారి నుంచి సొమ్ము ఎలా రికవరీ చేస్తారనేది ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. చెన్నూర్ నియోజక వర్గంలోని జైపూర్ పీఏసీఎస్ చైర్మన్ గుండా తిరుపతి కార్యాలయం నిర్మా ణం కోసం రూ. 4.50 లక్షలు దుర్వినియో గం, చెన్నూర్ చైర్మన్ రాంరెడ్డి అడ్వాన్స్‌గా రూ.26 వేలు తీసుకొని చెల్లించకపోవడం, కోటపల్లి సీఈఓ రాజునాయక్ ఎరువుల డబ్బులు రూ. 6,28,467 వాడుకున్నా చైర్మన్ సాంబా గౌడ్ పట్టించుకోకపోవడం, ఎరువుల అమ్మకాల్లో తేడాలు, మందమర్రి చైర్మన్ ప్రభాకర్ రావు అడ్వాన్స్ రూపంలో రూ. 52 వేలు తీసుకొని కొంత చెల్లించగా రూ. 37,803 బకాయి కారణంగా పక్కన పెట్టారు.
అలాగే బెల్లంపల్లి నియోజక వర్గంలోని నెన్నెల సీఈఓ రాజేష్ గౌడ్ ఎరువుల అమ్మకాలలో రూ. 6,62,891 దుర్వినియోగానికి పాల్పడటం, అమ్మకాలలో తేడా వచ్చి నా పట్టించుకోని కారణంగా చైర్మన్ మేకల మల్లేష్ ను, భీమిని పీఏసీఎస్ లో రైతుల నుంచి రూ. 14,22,297 రుణాలను సీఈఓ రాజేందర్ రావు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, సక్రమంగా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించనందుకు చైర్మన్ నారాయణను తొలగించారు.
మంచిర్యాల నియోజక వర్గంలోని మంచిర్యాల పీఏసీఎస్ సీఈఓ పెంట సత్యనారా యణ రైతుల పేరిట రుణం తీసుకోవడం, ఎరువుల సొమ్ము సొంతానికి వాడుకోవడం లాంటివాటికి పాల్పడినా పట్టించుకోనందు కు చైర్మన్ సందెల వెంకటేష్‌ను, పడ్తనపల్లి సొసైటీ చైర్మన్ మల్రాజు రామారావు సొసైటీకి కంపౌండ్ వాల్ పేరిట, ఎరువుల సొమ్ము రూ. 5.50 లక్షలు వాడుకుని కొంత చెల్లించగా ప్రస్తుతం రూ. 4.95 లక్షలు బకా యి ఉన్నందుకు, జెండా వెంకటాపూర్ సొసై టీ చైర్మన్ తిప్పని లింగయ్యను సీఈఓ శ్రీనివాస్ పాల్పడిన రూ. 5 లక్షలు అవినీతి, అక్ర మాలపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నందుకు సస్పెండ్ చేసినందుకు పక్కన పెట్టగా గూడెం సొసైటీ చైర్మన్ సురేష్ అడ్వాన్స్ రూ. 87,245 తీసుకొని కొంత చెల్లించి రూ. 42,245 బకాయి ఉన్నకారణం గా, నెల్కి వెంకటాపూర్ సొసైటీ చైర్మన్ లింగ న్న తీసుకున్న రూ. 5 లక్షల రుణంలో సగం కట్టగా మరో రూ.2.50 లక్షలు బకాయి ఉన్న కారణంగా తొలగించారు. 2022-23 నుంచి జిల్లా సహకార అధికారి కార్యాలయ అధికారుల ఆడిటింగ్ తర్వాత పది పాయింట్ల మీద చర్చించిన అనంతరం చైర్మన్ పదవీ నుంచి పక్కనపెట్టారు.
చైర్మన్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లు...
తొలగించిన 11 మంది పీఏసీఎస్ చైర్మన్ల స్థానంలో జిల్లా సహకార కార్యాలయంలోని అధికారులను స్పెషల్ ఆఫీసర్ల(ఎస్ ఓ)ను నియమించారు. జైపూర్, నెన్నెల పీఏసీఎస్ సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏ హారతిని ఎస్ ఓగా నియమించగా చెన్నూర్, కోటపల్లి సొసైటీలకు సీనియర్ ఇన్ స్పెక్టర్ ఏవీఆర్ఢీ ప్రసాద్ ను, భీమిని, మందమర్రి సొసైటీలకు జీ సందీప్ కుమార్ ను, మంచిర్యాల, గూడెం సొసైటీలకు సీనియర్ ఇన్ స్పెక్టర్ జీ రాజేందర్‌ను, పడ్తనపల్లి సొసైటీకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకట రమణ, జెండా వెంకటాపూర్ (జేవీ పూర్), నెల్కి వెంకటాపూర్ (ఎన్వీ పూర్) పీఏసీఎస్ సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏ మల్లారెడ్డిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు.